చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ! | Chennai Express Cinema Review | Sakshi
Sakshi News home page

చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!

Published Fri, Aug 9 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!

చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!

బాద్షా, డూప్లికేట్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్థానీ చిత్రాల తర్వాత కామెడీ, యాక్షన్ చిత్రాల్లో తరహా చిత్రాల్లో షారుక్‌ను చూడక బాలీవుడ్ అభిమానులు చాలా రోజులైంది.  తొలినాళ్లలో షారుక్ యాక్షన్, కామెడి నేపథ్యం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ మధ్యలో దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లాంటి ప్రేమ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ముద్ర వేసుకున్నాడు షారుక్. లవ్, రొమాన్స్ కథాంశాలతో మొన్నటి ‘జబ్ తక్ హై జాన్’ ఘోర పరాజయం వరకు అదే పంథాను కొనసాగించాడు. ‘జబ్ తక్ హై జాన్’ చిత్రం ఫ్లాప్ తర్వాత యాక్షన్, కామెడి అంశాల మేలవింపుతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ద్వారా షారుక్ ముందుకు వచ్చాడు. తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత దీపికా పదుకోనె,దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ కాంబినేషనలో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కథ.. గొప్పగా చెప్పుకునేంత సీన్ ఉన్న కథ కాదు. ఉత్తర భారత దేశానికి చెందిన యువకుడు, దక్షిణాది అమ్మాయితో ప్రేమలో పడటం సింగిల్ లైన్ స్టోరి. 
 
రాహుల్ అనే యువకుడు తన తాత అస్థికలను రామేశ్వరంలో కలిపేందుకు బయలుదేరుతాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనా  చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌ని కలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీనా స్వంత గ్రామానికి రాహుల్ వెళ్లాల్సి వస్తుంది. అయితే మీనా స్వంత గ్రామంలో ఏమి జరిగింది. రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారనే అంశాలతో తెరకెక్కిన సాదాసీదా ప్రేమకథ చెన్నై ఎక్స్‌ప్రెస్.
 
అయితే దక్షిణాది కామెడీ ట్రాక్‌కు షారుక్ రొమాంటిక్ ఇమేజిని కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి, యూనస్ సజావాల్ అందించిన స్క్రీన్ ప్లే, కేరళ అందాలు, అద్బుతమైన దూద్లే ఫోటోగ్రఫీలు సినిమాపై ప్రేక్షకుడు పట్టు సాధించేలా చేశాయి. మున్నార్, దేవికులమ్ లేక్, మీసాపులిమాలా, వాగవారా, కన్నిమాలా ప్రాంతాలు,  దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అందాలను అద్బుతంగా తెరకెక్కిచడంలో కెమెరామెన్ దూద్దే సఫలీకృతమయ్యాడు. విశాల్, శేఖర్‌లు తమ సత్తాకు తగినంతగా సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేపథ్యంగా తైలవర్ (లుంగీ డ్యాన్స్) పాట, కాశ్మీర్ మే తూ  కన్యాకుమారి, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 
షారుక్ ఖాన్‌కు రాహుల్ లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలో నటించడం కొట్టిన పిండే. రొమాంటిక్ టచ్‌తో యాక్షన్ హీరోగా షారుక్ చార్మింగ్‌గా కనిపించాడు. రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో షారుక్ తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమనే రీతిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటనను ప్రదర్శించాడు. క్లైమాక్స్‌లో షారుక్ అదరగొట్టేశాడు. షారుక్ తన మార్క్ కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మీనా(మీనమ్మ)పాత్రలో దీపిక పదుకొనే అమాయకత్వంతోపాటు, చెలాకీతనంతో అద్బుతంగా ప్రదర్శించింది. తమిళ సాంప్రదాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో దీపికా కట్టు,బొట్టు, క్యాస్టూమ్స్ ఓహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్‌గా కనిపించాలంటే అర్ధనగ్నంగా కనిపించాల్సిందే అనే ఫీలింగ్ ఉన్న ఈ రోజుల్లో.. కంచిపట్టు చీరలో మీనమ్మాగా దీపికా గతంలో ఎన్నడూ లేనంత అందంగా తెరమీద మెరిసింది. మీనా తండ్రిగా దుగేశ్వర పాత్రలో సత్యరాజ్ గంభీరంగా కనిపించాడు. ఇక విలన్ పాత్ర తంగబలీ పాత్రలో నికితిన్ ధీర్ పర్వాలేదనిపించాడు.
 
అయితే కామెడీయే ప్రధాన నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ లో  లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు చెన్నై ఎక్స్‌ప్రెస్ నచ్చడం ఖాయం. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఆ ఘనత షారుక్, దీపికాలకే దక్కుతుంది. షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కథను పక్కన పెట్టి కథనంతోనే ప్రయోగం చేసేందుకు దర్శకుడు రోహిత్ శెట్టి సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపించింది.
 
విశేషాలు: 
దేశవ్యాప్తంగా 3500, విదేశాల్లో 700 థియేటర్లలో విడుదలైంది. భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్‌లేని పెరూ, ఇజ్రాయిల్ దేశాతొలిసారి విడుదలైన బాలీవుడ్ చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో 195 స్క్రీన్లలో, బ్రిటన్ 175 స్క్రీన్లతోపాటు  మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రద ర్శనకు సిద్ధమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement