టైటిల్ : ఛపాక్
నటీనటులు: దీపికా పదుకొనే, విక్రాంత్ మాస్సే, మధుర్‌జీత్ సర్ఘీ, వైభవి ఉపాధ్యాయ, పాయల్ నాయర్
దర్శకత్వం: మేఘనా గుల్జార్
యాసిడ్ దాడుల నేపథ్యంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘ఛపాక్’. టాప్ విమెన్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ భారీ సూపర్‌హిట్ సినిమాల తర్వాత దీపిక.. తల్వార్, రాజీ వంటి బలమైన సామాజిక చిత్రాల తర్వాత మేఘనా గుల్జార్ కాంబినేషన్‌లో తెరకెక్కడం.. దీపిక పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యమున్న వుమెన్ ఓరియెంటెడ్ సినిమా చేయడంతో ‘ఛపాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో యాసిడ్ అటాక్ విక్టిమ్‌గా, ఫైటర్‌గా మాలతి(దీపిక) పోరాటమేమిటంటే..
కథ: 19 ఏళ్ల మాలతిపై ఓ రోజు అకస్మాత్తుగా యాసిడ్ దాడి జరుగుతుంది. తెలిసిన వాడే ప్రేమిస్తున్నానంటూ వేధించి.. తన ప్రేమను ఒప్పుకోకవడంతో యాసిడ్ దాడి చేస్తాడు. ఈ ఒక్క దాడితో ఆమె ఉనికి సమస్తం మారిపోతోంది. జీవితం తలకిందులవుతుంది. కలలు ఛిద్రమవుతాయి. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో తాను ఎలా పోరాటం చేసింది? ఎలా న్యాయాన్ని సాధించింది? ఎలా తోటి బాధితులకు అండగా నిలిచిందనేది మిగతా కథ.
విశ్లేషణ: యాసిడ్ దాడి.. నిత్యం దేశంలో ఎక్కడోచోట జరిగే దుర్మార్గమిది. యువతులు, మహిళల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న దారుణమిది. ఈ తీవ్రమైన సమస్యను ఒక నిజజీవిత పోరాటం ఆధారంగా మేఘనా గుల్జార్ తెరమీద ‘ఛపాక్’గా ఆవిష్కరించారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా అత్యంత బలంగా, బాధితుల కోణంలో సున్నితంగా మేఘనా ఈ సినిమాను రూపొందించారు. తల్వార్, రాజీ వంటి సినిమాలు తెరకెక్కించి భేష్ అనిపించుకున్న మేఘనా తాజా సినిమా ‘ఛపాక్’ను వాస్తవానికి దగ్గరగా, సున్నితంగా మలిచారు. ఈ క్రమంలో కథ, కథనాలు కొంత నెమ్మదించినా.. సినిమా స్లోగా సాగుతున్నట్టు అనిపించినా.. డైలాగులు, పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. యాసిడ్ దాడి బాధితురాలిగా తొలిసారి డీ గ్లామరైజ్ పాత్రను పోషించిన దీపిక తన పాత్రలో ఒదిగిపోయింది.
పాత్రకే కాదు, సినిమాకు న్యాయం చేసింది. ఒక యాసిడ్ బాధితురాలిగా శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే వేదన, సర్జరీలు, న్యాయం కోసం చేసే కోర్టుల చుట్టూ తిరుగుతూ రావడం, తోటి బాధితులకు అండగా ఉండటం, నిరుపేద నేపథ్యం, కుటుంబసమస్యలు.. వీటన్నింటి మధ్య ధైర్యంగా నిలబడి, పోరాటం చేసి విజయం సాధించిన ధీరవనితగా దీపికా పదుకొనే నటన సహజత్వానికి దగ్గరగా అదుర్స్ అనిపిస్తుంది. సమాజం పట్ల ఫ్రస్టేట్ అవుతూ.. యాసిడ్ బాధితులకు అండగా ఉండే ఎన్జీవో కార్యకర్తగా, మాలతిని అర్థం చేసుకునే సైలెంట్ ప్రేమికుడిగా విక్రాంత్ మాస్సే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాలతి లాయర్ అర్చనగా మధుర్జీత్ సర్ఘీ, ఇతర పాత్రలు పోషించిన నటులు తమ పరిధిమేరకు చక్కగా నటించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, నేపథ్య సంగీతం అన్ని సినిమాకు చక్కగా అమిరాయి.
గాంభీరమైన యాసిడ్ బాధితుల సమస్యను తెరపై చూపే క్రమంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అంతగా నాటకీయతకు ప్రాధాన్యమివ్వలేదు. సినిమా ప్రారంభంలో మాలతిపై యాసిడ్ దాడి జరగడం, నిందితుడ్ని పట్టుకోవడం, కేసు కోర్టుకు వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక, కోర్టుల్లో మాలతి చేసిన పోరాటం, యాసిడ్ అమ్మకాలను నిషేధించాలంటూ పిల్ వేయడం, యాసిడ్ దాడి దోషులకు కఠిన శిక్ష విధించేందుకు ప్రత్యేకంగా సెక్షన్ 326ను తీసుకురావడం వంటివి సహజాత్వానికి దగ్గరగా దర్శకురాలు చూపారు. ఈ క్రమంలో చాలా సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
యాసిడ్ దాడి బాధితురాలు చనిపోతూ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో చదువుతుంటే ప్రేక్షకులు కదిలిపోవడం ఖాయం. చదవాలి, జీవితంలో ఎదగాలనుకునే అమ్మాయిలు టార్గెట్‌గా యాసిడ్ దాడులు జరుగుతున్నాయని, ఈ ఒక్క దాడితో చిటికెలో (ఛపాక్ అంటే అర్థం ఇదే) వారి ఉనికి, గుర్తింపే నామరూపాలు లేకుండా పోవడం ఎంత విషాదమో చూపిస్తూ.. కేవలం ముఖం మీద దాడి చేశారు కానీ, తమ దృఢసంకల్పం మీద కాదన్న బాధితుల మనోధైర్యాన్ని, పోరాటాన్ని చాటుతూ దర్శకురాలు ‘ఛపాక్’ను తెరమీద ఆవిష్కరించారు. సినిమా స్లోగా అనిపించినా.. మూస సినిమాలకు భిన్నంగా కథలో కొత్తదనం, నిజజీవిత పోరాట స్ఫూర్తి కోరుకునేవారు ఈ సినిమాను చూడవచ్చు. ఇక, సినిమాలో భాగంగా వచ్చే పాటలు కథకు బలాన్ని చేకూర్చడమే కాదు సినిమాకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు
బలాలు
దీపికా పదుకొనే నటన
మేఘనా గుల్జార్ దర్శకత్వం, పాటలు
ఒక తీవ్రమైన సమస్యను సెన్సిబుల్‌గా తెరకెక్కించడం
బలహీనతలు
స్లో నరేషన్
నాటకీయత అంతగా లేకపోవడం
- శ్రీకాంత్ కాంటేకర్
Comments
Please login to add a commentAdd a comment