హిట్‌ గ్యారంటీ... గో ఎహెడ్‌ అన్నాను | Chiranjeevi about Kalyan Dev at Vijetha Audio Launch | Sakshi
Sakshi News home page

హిట్‌ గ్యారంటీ... గో ఎహెడ్‌ అన్నాను

Published Mon, Jun 25 2018 1:10 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Chiranjeevi about Kalyan Dev at Vijetha Audio Launch  - Sakshi

సెంథిల్, అల్లు అరవింద్, రాజమౌళి, సాయి కొర్రపాటి, చిరంజీవి, కల్యాణ్‌ దేవ్, కీరవాణి, రాకేశ్‌ శశి, మాళవికా నాయర్‌

‘‘చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ అని నాతో కల్యాణ్‌ దేవ్‌ ఓసారి చెప్పాడు. ‘సినిమా అన్నది మహా సముద్రం లాంటిది. ఎంత మందినైనా తనలో చేర్చుకుంటుంది. సినిమాకు మనం ఏం ఇస్తున్నాం? అన్నదాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గ్లామర్‌ ఉంది. నీలో ఆ జోష్‌ ఉందా? లేదా? తపన ఉందా?  లేదా? ఎంత స్థాయిలో ఉంది? అన్నదాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని చెప్పాను’’ అన్నారు చిరంజీవి.

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘విజేత’. రాకేశ్‌ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘విజేత’ టైటిల్‌ పెట్టిన వెంటనే నేను చేసిన ‘విజేత’ గుర్తుకు వచ్చింది. ఆ కథకు, ఈ కథకు చాలా సిమిలారిటీస్‌ ఉంటాయి.

ఫస్ట్‌ హియరింగ్‌లోనే చాలా నచ్చింది. ‘చక్కటి కుటుంబ కథా చిత్రం. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్‌షిప్‌ మనసుకు హత్తుకునేలా ఉంది. కచ్చితంగా సక్సెస్‌ అవుతుంది. గో ఎహెడ్‌’ అన్నాను. అప్పట్లో మాస్‌ యాక్షన్‌ సినిమాలు చేసేప్పుడు అరవింద్‌గారు నాకు ‘విజేత’ కథ వినిపించినప్పుడు కొంచెం బెరుకుగా అనిపించింది. అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనుకున్నాను. ఆ సినిమా కొత్త ఆడియన్స్‌ కోసం, ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం చేశాం. అంతకంత ఆదరణ లభించింది.

ఎలాంటి ఇమేజ్‌ లేని కల్యాణ్‌కు కొత్త ఆడి యన్స్, అభిమానం లభిస్తుందని నమ్ముతున్నాను. కంట తడి పెట్టించే సీన్స్‌ రాకేశ్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. తన మార్క్‌తో ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేశాడు. దర్శక–నిర్మాతలు అమ్మ, నాన్నలు లాంటి వాళ్లు అంటారు. రాను రాను నిర్మాత పాత్ర క్యాషియర్‌లాగా అయిపోయింది. డబ్బులు పెట్టడం తప్ప తను ఇన్వాల్వ్‌ అవ్వడం కానీ, తనని ఇన్వాల్వ్‌  చేయడం కానీ లేదు. ఇలాంటి రోజుల్లో సాయిగారు కథల్లో మంచి అభిరుచి ఉన్న నిర్మాత.

ఈ కథను ఎంతమందికి అందించగలం? ఆడియన్స్‌ని ఎలా అలరించాలి? మన బ్యానర్‌ని నెక్ట్స్‌ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించే నిర్మాత కొర్రపాటి సాయిగారు. ఆయన తీసిన ‘ఈగ’, జో అచ్యుతానంద, లెజెండ్‌’ చాలా బావుంటాయి. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. సెంథిల్‌ కెమెరా అంటే విజువల్స్‌ పరంగా చూసుకునే పని ఉండదు. సాంగ్స్‌ అన్నీ బాగున్నాయి. ‘కొ కొ కోడి...’ నా ఫేవరేట్‌ సాంగ్‌. సినిమాల్లోకి ఎవరూ వెల్కమ్‌ చేయరు. ట్రైనింగ్‌ తీసుకుని ప్రయత్నించు అని కల్యాణ్‌తో అన్నాను. సత్యానంద్‌ దగ్గర తీసుకున్నాడు.

ట్రైనింగ్‌లో ప్లస్‌లు మైనస్‌లు తెలుసుకున్నాడు. ఎంతో పరిణితితో చేశాడు. డ్యాన్స్‌ బాగా చేశాడు. రొమాంటిక్‌ సీన్స్‌ చెప్పనక్కర్లేదు. రాకేశ్‌ తనకు కావల్సింది రాబట్టాడు. మాళవికా కొంటెగా, ఇంటెన్స్‌గా చేసింది. ఇందాక రాజమౌళి చెప్పినట్టు ఆ ‘విజేత’ ఎంత సక్సెస్‌ ఆయ్యిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్‌ అవ్వాలి. ఈ సినిమాను జూలై 12న విడుదల చేస్తున్నాం. తేజ్‌ సినిమా 6న ఉంది. అభిమానులు ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు. వాడికీ ఆశీస్సులు లభిస్తాయి. కల్యాణ్‌కీ ఆశీస్సులు లభిస్తాయి’’ అన్నారు.


కల్యాణ్‌ దేవ్‌ మాట్లాడుతూ – ‘‘సాయిగారు చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను వాళ్ల లాగే సక్సెస్‌ అవ్వాలని అనుకుంటున్నాను. రాకేశ్‌కి క్లారిటీ ఉంది. ప్రతీ ఫ్రేమ్‌ బాగా తీశారు. సెంథిల్‌గారు చాలా కూల్‌. మ్యూజిక్‌ హర్షవర్థన్‌ రామేశ్వర్‌ అమేజింగ్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) బ్లెస్సింగ్స్‌ నాకు ఉంటాయని అనుకుంటున్నాను’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు మంచి యాక్టర్, డ్యాన్సర్, ఫైటర్‌. అది అందరికీ తెలిసిందే. ఆయన స్టోరీని బాగా జడ్జ్‌ చేయగలుగుతారు.

స్టోరీ విన్న వెంటనే ఏది తగ్గించాలి? పెంచాలి అని చెబుతారు. ‘మగధీర’ కథ ఫస్ట్‌ చిరంజీవిగారికే చెప్పాను. ఆయన అప్రూవ్‌ తీసుకొనే చేశాం. ఈ సినిమా కూడా ఆయనకు నచ్చాకే చేశారు. అదే బిగ్గెస్ట్‌ కాన్ఫిడెన్స్‌. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో సాయిగారు ఎక్కడా తగ్గలేదు. సాంగ్స్‌ చాలా బావున్నాయి. అప్పుడు ‘విజేత’ చిరంజీవిగారికి ఎంత సక్సెస్‌ తెచ్చిందో, ఈ సినిమా కూడా కల్యాణ్‌కి అంతే సక్సెస్‌ తేవాలి’’ అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి వరుసగా యాక్షన్‌ పిక్చర్స్‌ చేస్తున్నపుడు ‘విజేత’ సినిమా కథ విన్నాను. నచ్చింది చేయాలనుకున్నాను. చిరంజీవిని అడిగితే ‘నీ మనసుకు నచ్చింది చెయ్‌’ అన్నారు. సినిమా పెద్ద హిట్‌ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాత సాయిగారు కొత్త టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి సినిమా నిర్మిస్తుంటారు. అటువంటి నిర్మాతలు మనకి ఉండాలి.

మెగా కుటుంబం నుంచి ఎవరు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నా ఒక ధైర్యం చిరంజీవిగారి అభిమానులు. దానికి హీరోలు టాలెంట్‌ని యాడ్‌ చేసుకుని సక్సెస్‌ అవుతున్నారు. కల్యాణ్‌ కూడా అలాంటి టాలెంట్‌తో సక్సెస్‌ అందుకుంటాడని ఆశీస్తూ, ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. రాకేశ్‌ శశి మాట్లాడుతూ– ‘‘కథ మొదలుపెట్టక ముందు ‘మన కథే హీరోని తీసుకురావాలి’ అని సాయిగారు నాతో అన్నారు.  ఆ కథే మమ్మల్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకువెళ్ళింది. చిరంజీవి అల్లుణ్ణి సినిమాలో హీరోని చేసింది.

చిరంజీవిగారి ముందు కూర్చుని కథ చెప్పినప్పుడు నాలో ఉన్న ఎమోషన్‌ జీవితాంతం గుర్తుంటుంది. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోని ఎంత బాగా ప్రజెంట్‌ చేయాలో అంత బాగా ట్రై చేశాం. ఈ చిత్రంలో కల్యాణ్‌ చేసిన క్యారెక్టర్‌కి, రియల్‌ లైఫ్‌ పర్శనాలిటీకి చాలా తేడా ఉంది. తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం’’ అన్నారు.కీరవాణి మాట్లాడుతూ – ‘‘మన హృదయాల్ని గెలుచుకుని శాశ్వత విజేతగా నిలిచిపోయిన చిరంజీవిలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు అలానే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సాయిగారు మా ఫ్యామిలీ మెంబర్‌లాగా. ఈ సినిమాతో కల్యాణ్‌ దేవ్‌కి మంచి బ్రేక్‌ వస్తుందనుకుంటున్నాను. రామేశ్వర్‌ మంచి కంపోజర్‌’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement