
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కనకాల(78) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. కనకాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను హైదరాబాద్‌లో లేని కారణంగా లక్ష్మీదేవి కుమారుడు రాజీవ్ కనకాలకు చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి మనసుకి ఇవి బరువైన క్షణాలని చిరంజీవి అన్నారు.
‘పేరు లక్ష్మీదేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెళకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత గర్వపడతానో.. లక్ష్మీదేవిగారి శిష్యుడని చెప్పుకునేందుకు అంత గర్వపడుతున్నాను. ఆమె దూరమవ్వడం తీరని లోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న అందరికీ ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నానని’ రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి గురించి చిరంజీవి షేర్ చేసుకున్నారు. ఈ విషయాలను పీఆర్వో బీఏ రాజు తన ట్వీటర్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
తల్లి లక్ష్మీదేవితో నటుడు రాజీవ్ కనకాల (ఫైల్ ఫోటో)
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల కూడా నటుడుగా రాణించారు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. కెరీర్ ప్రారంభంలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఎంతో మంది నటీనటులకు ఆమె శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment