'మేము సైతం'లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జయసుధ, జయప్రద
హైదరాబాద్: మేము సైతం కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి పైసా హుద్ హుద్ తుపాను బాధితులకు వినియోగిస్తామని సినీ నటుడు చిరంజీవి చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు తమ బాధ్యతగా ముందుకు వచ్చామని అన్నారు. ప్రజలకు ఇలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి 'మేము సైతం' ముగింపు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు.
తెలుగు సినీపరిశ్రమ మరిచిపోలేని రోజు ఇదని పేర్కొన్నారు. 'మేము సైతం' యజ్ఞంలా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెర వెనుక, తెర ముందు ఎంతో మంది అలుపెరగకుండా అహర్నిశలు కృషి చేశారని వెల్లడించారు. చిత్రపరిశ్రమకు చెందిన వారంతా ఒకచోటికి చేరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఆషామాషీ విషయం కాదన్నారు.
'మేము సైతం' కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించామన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మనసారా నవ్వుకున్న సందర్భమిది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలోని ప్రతిఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారని ప్రశంసించారు. ఇందులో పాలుపంచుకున్న వారిని, తమకు మద్దతు తెలిపిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.