కృష్ణగారికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలి | chiranjeevi speech at sarileru nikevvaru press meet | Sakshi
Sakshi News home page

కృష్ణగారికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలి

Published Mon, Jan 6 2020 2:34 AM | Last Updated on Mon, Jan 6 2020 4:11 AM

chiranjeevi speech at sarileru nikevvaru press meet - Sakshi

వంశీ పైడిపల్లి, తమన్నా, రష్మిక, విజయశాంతి, చిరంజీవి, మహేశ్‌బాబు, అనిల్‌ రావిపూడి, దేవిశ్రీ ప్రసాద్, అనీల్‌ సుంకర

‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది.. షాక్‌ తిన్నాను.. ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్‌ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంతకంటే ఇంకేం కావాలి.. అందరూ ఇలాగే చేయాలి.. అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్‌ కళకళలాడుతుంటాయి’’ అని చిరంజీవి అన్నారు. మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్ర చేశారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్‌’లో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు అభినందిస్తున్నా.

మహేశ్‌ ఎంతో ప్యాషనేట్‌గా ఉంటాడు.. ముద్దొచ్చేలా ఉంటాడు.. బిడ్డలాంటి అనుభూతి. ఎప్పుడూ తనలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనకాల చిన్న చిలిపితనం కూడా ఉంటుంది.. దొంగ(నవ్వుతూ). ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యే వరకూ మహేశ్‌ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్‌ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి.

దాన్నిప్పుడు రామ్‌చరణ్‌ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్‌కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్నుదన్నుగా నిలబడటం గ్రేట్‌.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్‌ డేస్‌ పెరగడం వల్ల బడ్జెట్‌ వృథా అయిపోతోంది.. నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు.. అలా చేయకుంటే మర్యాదగా ఉండదు(నవ్వుతూ). మన సౌత్‌ ఇండియాలోనే సీనియర్‌ మోస్ట్‌ యాక్టర్‌ కృష్ణగారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో? రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చేలా నిజాయతీగా కృషి చేయాలి.. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం.మహేశ్‌తండ్రి కృష్ణగారు అనిపించుకునే స్థాయికి మహేశ్‌ వస్తుండటం ఆయనకి గర్వకారణం.. చరణ్‌ విషయంలో నాకూ అంతే. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాం తికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో.., మా ఫ్రెండ్‌ రజనీ ‘దర్బార్‌’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్‌డూపర్‌ హిట్స్‌ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక–నిర్మాతలు బాగుండాలి’’ అన్నారు.


మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఒక్కడు’ సినిమా చూసిన చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ‘అర్జున్‌’ సినిమా షూటింగ్‌లో మా సెట్‌కు వచ్చి, ఆ సెట్‌ను చూసి నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలి..  తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకుకెళ్లాలని చెప్పిన మాటలు గుర్తున్నాయి. ‘పోకిరి’లో నా నటన గురించి , సినిమా గురించి రెండు గంటలు మాట్లాడారు.. మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తి సార్‌.

‘భరత్‌ అనే నేను, మహర్షి’ రిలీజ్‌ అయినప్పుడు అభినందనలు చెబుతూ తొలి ఫోన్‌ కాల్‌ ఆయన నుంచే వచ్చింది.. జనవరి 11న కూడా మొదటి కాల్‌ మీ నుంచే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్‌. ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాను. చిరంజీవిగారిలో, విజయశాంతిగారిలో మంచి క్రమశిక్షణ ఉండేది. ఈ సినిమాలోని భారతి పాత్ర విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. నా కెరీర్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ చాలా తొందరగా పూర్తయిందంటే ఒక కారణం అనిల్‌ రావిపూడి. జనవరి 11న మీకు(అభిమానులు) కానుక ఇవ్వబోతున్నాం.. ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు.


విజయశాంతి మాట్లాడుతూ– ‘‘1979 నుంచి 2020 వరకూ లాంగ్‌ జర్నీ. అందరితో కలిసి నడిచాను.. నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమకు నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణగారు, విజయనిర్మలగారు. నా సక్సెస్‌ఫుల్‌ హీరో కృష్ణగారని చెప్పుకుంటాను. సినిమాల్లోకి నా రీ–ఎంట్రీ మహేశ్‌తో కావడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్‌ అబ్బాయి వచ్చినా తనతోనూ యాక్ట్‌ చేస్తాను. వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్‌ చేయిస్తున్న మహేశ్‌ సినిమాలోనే కాదు.. బయట కూడా సూపర్‌స్టారే. చిరంజీవిగారు, నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం.. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి’’అన్నారు.


అనీల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగార్ని చూసి మేమంతా నేర్చుకోవాలి.. మే 31న కృష్ణగారి పుట్టినరోజున ప్రారంభించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల  జనవరి 11న అని ఫిక్స్‌ అయ్యాం.. ఆ రోజున అద్భుతం జరుగుతుంది. ఈ సినిమా మహేశ్‌గారి అభిమానులతో పాటు, అన్నివర్గాల వారికీ నచ్చుతుంది. ఈ సినిమాతో మహేశ్‌బాబుపై అభిమానం పదింతలు పెరుగుతుంది. ఈ సినిమా తెలుగువాళ్లందరూ తలెత్తుకుని తిరిగేలా ఉంటుంది’’ అన్నారు.


నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘నేను ముప్పై ఏళ్ల క్రితం తీసిన సినిమా ‘కొడుకు దిద్దిన కాపురం’. ఆరోజునే ఇంతటి పాపులారిటీని  సంపాదించుకున్నాడు మహేశ్‌. ఆ సినిమాలో కృష్ణ, విజయశాంతి, మోహన్‌బాబు గార్లవంటి పెద్ద నటుల మధ్య 14ఏళ్ల వయసులోనే నటించి లిటిల్‌ స్టార్‌ అనిపించుకుని ఈ రోజు సూపర్‌స్టార్‌ అయ్యాడు. ఏ సినిమా అయినా మొదలు పెట్టేముందు బడ్జెట్, షెడ్యూల్, రిలీజ్‌ విషయాలు క్రమశిక్షణతో చేస్తే చిత్ర పరిశ్రమ కలకాలం నిలబడుతుంది.. అది హీరోల సహకారం లేకుంటే అవదు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ రికార్డులు తేవాలి’’ అన్నారు.


‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘‘అందరివాడు’ చిరంజీవిగారు ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే మహేశ్‌బాబుగారితో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇటీవల ‘మహర్షి’, ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’.... మన కాంబినేషన్‌ హ్యాట్రిక్‌.. ఫిక్స్‌ సార్‌ (మహేశ్‌ను ఉద్దేశిస్తూ). ‘పటాస్‌’ తర్వాత అనిల్‌ మాతో నాలుగు సినిమాలు చేశారు. మా బ్యానర్‌కు మంచి సినిమాలు ఇస్తున్నాడు. థ్యాంక్స్‌ అనిల్‌. ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.  అనిల్‌ సుంకరగారితో కలిసి ఈ చిత్రం చేయడం హ్యాపీ. దేవిశ్రీ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ఇది 12వ సినిమా. 1999లో ‘శత్రువు’ సినిమా షూటింగ్‌ సమయంలో విజయశాంతిగారిని చూశాను. మా భాగస్వామ్యం ఉన్న సినిమాతో ఆమె రీ ఎంట్రీ అవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.


అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘పొద్దున్నే నాకు కొడుకు పుట్టాడు.. సాయత్రం ఈ వేడుక. ఇలాంటి రోజు.. నెవర్‌ బిఫోర్‌... ఎవర్‌ ఆఫ్టర్‌. స్వయంకృషితో, కష్టంతో మనం ఎలా ఎదగాలో నేర్పిన పేరు చిరంజీవిగారు. 40 ఏళ్లుగా వింటున్న పేరు అది. మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్‌ ఉంటుంది.. నాలో కళ పుట్టడానికి కారణం చిరంజీవిగారే. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విన్న మహేశ్‌గారు ‘షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ సినిమా చేస్తున్నాం’ అని చెప్పిన క్షణాల నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్‌ జరుగుతున్నప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలోని ముఖ్యమైన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను.

ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఇచ్చారాయన. డబ్బింగ్‌ అయిపోయి సినిమా పూర్తయిన తర్వాత.. ‘బ్రదర్‌...నా లైఫ్‌లో చాలా పెద్ద పెద్ద సక్సెస్‌లను చూశాను. నువ్వు ఎదుగుతున్నావ్‌.. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ని నువ్వు ఎంజాయ్‌ చేయ్‌’ అంటూ మెసేజ్‌ చేసిన మహేశ్‌గారికి థ్యాంక్స్‌.. మీరు ఇచ్చిన దానికి నేను ఏం ఇవ్వగలను.. ఒక మంచి హిట్‌ ఇచ్చి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ట్రైలర్‌లో మహేశ్‌గారు చెప్పినట్లు బొమ్మ దద్దరిల్లి పోద్ది.  ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణగారు కూడా ఉన్నారు. దానికి దేవిశ్రీ ఎలాంటి ఆర్‌ఆర్‌ ఇచ్చారో సినిమాలో చూడండి. ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ఒక కారణమైన నమ్రతగారికి థ్యాంక్స్‌.  ‘దిల్‌’ రాజు, అనీల్‌ సుంకరగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు.  


దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారిని, మహేశ్‌గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా సంతోషంగా ఉంది. మహేశ్‌బాబుగారు సూపర్‌స్టారే కాదు. ఆయనకు సూపర్‌స్టార్‌ లాంటి హృదయం కూడా ఉంది. ఈ సినిమాలో మహేశ్‌గారి పెర్ఫార్మెన్స్‌ మైండ్‌బ్లాకింగ్‌గా ఉంటుంది. విజయశాంతిగారితో మా నాన్నగారు(రచయిత సత్యమూర్తి) పనిచేశారు.  ఈ సినిమాకు ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.  అనీల్‌ సుంకర, ‘దిల్‌’ రాజుగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు.


 హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, మహేశ్‌బాబులకు ఓ కథ రాసి, వారి కాంబినేషన్‌లో సినిమా తీయాలని అనిల్‌ రావిపూడిగారిని కోరుతున్నా. మీరు అలా చేస్తే ఆ కాంబినేషన్‌ సౌండ్‌ ఇండియా మొత్తం వినిపిస్తుంది.. బాక్సాఫీస్‌ రేంజ్‌ హాలీవుడ్‌ సినిమాకి దీటుగా ఉంటుందని నమ్ముతున్నా. ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే, మహేశ్‌లాంటి వ్యక్తిని మనకిచ్చిన సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ మావయ్యకి థ్యాంక్స్‌’’ అన్నారు.   ఈ వేడుకలో రష్మిక మందన్నా, తమన్నా, నిర్మాతలు రవిశంకర్, పి.కిరణ్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్, కొరటాల శివ, శ్రీనువైట్ల, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, నటుడు బండ్ల గణేశ్, నటీమణులు సంగీత, హరితేజ, కౌముది, పల్లవి డోరా, పాటల రచయితలు రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు.

విజయశాంతిని ఒక్కమాట కూడా అనలేదు
ఈ సందర్భంగా విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకుంటూ– ‘‘రాజకీయాలు శత్రువులను పెంచుతుంది.. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో విజయశాంతి నన్ను కామెంట్‌ చేసినా, తనపై నాకు ఉన్న ప్రేమ, సెంటిమెంట్‌ వల్ల ఒక్కమాట కూడా నేను తిరిగి అనలేదు.. నాకు మనసు రాదు.. ఎందుకంటే మా విజయశాంతి.. ఇన్నేళ్లు మా మధ్య గ్యాప్‌ వచ్చింది.. రాజకీయాలన్నది శాశ్వతం కాదు.. కొన్నాళ్లే.. ఇన్నేళ్లకు నా ఫ్రెండ్‌ని(విజయశాంతి) మళ్లీ కలిసేలా చేసినందుకు మహేశ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు.

చిరంజీవి, విజయశాంతి, మహేశ్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement