అంజలి భయపడలేదు!
‘‘ఇండియాలో కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు 18 కోట్లమంది ఉన్నారని గర్వంగా చెబుతున్నాం. కొత్తగా తీసిన చిత్రాలు చూడడానికి కనీసం ఐదు కోట్లమంది రాకపోతారా? వస్తారనే నమ్మకం నాకుంది’’ అన్నారు దర్శకుడు అశోక్. అంజలి ముఖ్యతారగా అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ చెప్పిన సంగతులు....
► పురాణాల్లోకి వెళితే... అర్జునుడి భార్యల్లో చిత్రాంగద ఒకరు. ఆమె మణిపూర్ మహారాణి. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా పెరుగు తుంది. బాగా గట్స్ ఉన్న లేడీ. మా సినిమాలో హీరోయిన్ కూడా మంచి గట్స్ ఉన్న అమ్మాయి. అందుకే, ‘చిత్రాంగద’ అని టైటిల్ పెట్టాను.
► ప్రపంచ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కొత్త పాయింట్ తో ఈ సినిమా తీశాం. ఇది హారర్ సినిమానా? లేక థ్రిల్లరా? అనిపిస్తుం ది. ఓ అమ్మాయికి వ్యక్తిగత సమస్యలు ఎదురైతే ఒక్కో స్టేజిలో తను ఎలా మారుతుందనేది కథ. మొండితనం, పట్టుదల గల ఓ అమ్మాయి లైఫ్ జర్నీ. థియేటర్‌లో ప్రేక్షకుడు ఓ కథ అనుకుంటే.. పారలల్‌గా మరో కథ నడుస్తుంది. క్లైమాక్స్‌లో అది అర్థమవుతుంది.
► ఇందులో అంజలి అల్ట్రా గ్లామరస్‌గా... క్యారెక్టర్ పరంగా షార్ట్స్ వేసుకుని నటించింది. అమెరికాలో మైనస్ 11 డిగ్రీల టెంపరేచర్‌లో చిత్రీకరించాం. ఫుల్ డ్రెస్సుల్లో ఉన్న అమెరికన్స్ షార్ట్స్ వేసుకున్న అంజలిని విచిత్రంగా చూసేవారు. చలికి సప్తగిరికి కూడా భయపడ్డారు. కానీ, అంజలి భయపడలేదు. తన మొండితనం, పట్టుదల చూసి రియల్ లైఫ్‌లో ఆమె ‘చిత్రాంగద’ అనిపించింది.
► తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా షూట్ చేశాం. తెలుగులో ఈ నెల 10న, తమిళంలో రెండు వారాల తర్వాత రిలీజ్ చేస్తాం. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మల్కాపురం శివకుమార్ విడుదల విషయంలో సహకరిస్తున్నారు.
► అనుష్కతో తీస్తున్న ‘భాగమతి’ బయోపిక్ కాదు. ఫిక్షనల్ స్టోరీ. మరో ఆరేడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ∙డబ్బులు తీసుకొచ్చే ప్రతి సినిమా నిర్మాతకు కమర్షియల్ సినిమానే. కంగనా ‘తను వెడ్స్ మను’ సిరీస్ 300 కోట్లకుపైగా వసూలు చేసింది. మూడేళ్లుగా మహిళలు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రాలు వెయ్యి కోట్లు వసూలు చేశాయి. ఫార్ములా బేస్డ్ కమర్షియల్ చిత్రాలెప్పుడూ ఉంటాయి. కానీ, యువతరం మాత్రం కొత్త సినిమాలకు ఓటేస్తున్నారు. ‘చిత్రాందగ’ వంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్‌ను ఆదరిస్తున్నారు.