డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్‌కమ్ బ్యాక్.
జనం ఒకసారి ఒక హిట్ పెయిర్‌ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్‌గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్‌తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్‌బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్‌తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ.
సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్‌ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం.
ప్రభు–మధుబాల
‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మేన్’ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్‌లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు.
అమితాబ్–రమ్యకృష్ణ
కెరీర్ పీక్‌లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్‌తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్‌బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్‌లో ఉన్న అమితాబ్‌కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
శోభన–సురేశ్ గోపి
మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆడియన్స్‌కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
రాధిక–శరత్ కుమార్
రాధిక– శరత్ కుమార్ ఆఫ్‌స్క్రీన్ కపుల్. ఆన్‌స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు.
సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్‌నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్‌లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్‌లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు.
స్వీట్ కపుల్–గులాబ్ జామూన్
ఈ ఏడాది మరో రీ–యూనియన్‌ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్‌కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం.
నువ్వు నేను – మరో సినిమా
కోలీవుడ్‌లో సూర్య–జ్యోతికలది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్‌బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం.
– ఇన్‌పుట్స్: గౌతమ్ మల్లాది
Comments
Please login to add a commentAdd a comment