
కాంపిటేషన్ మంచిది.. మా ఎన్నికల తీరే బాధ: రోజా
హైదరాబాద్: గతంలో కన్నా ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తీరు కాస్తంత బాధను కలిగించిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా అన్నారు. ఆదివారం జరుగుతున్న మా ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లకోసారి కావడంవల్ల పెద్దలంతా ఓసారి ఓచోట కూర్చుని ఎవరికో ఒకరిని 'మా' అధ్యక్షుడిని ఎన్నుకుంటే బావుండేదని అన్నారు. ఎవరి లాభాలను ఇందులో చూపించకుండా ఉండాల్సిందని, ఎవరో పెద్దలు తమ స్వార్థంతో దీనివెనుకాల ఉండి చిచ్చు పెట్టారని అన్నారు.
అయితే, కాంపిటేషన్ ఉండటం ప్రస్తుతం మంచిదని, అలా ఉన్నప్పుడే ఎవరు ఏం చేస్తారో ముందే చెప్తారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి మ్యానిఫెస్టో వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు చిన్నచిన్న నటులకు మా వల్ల పెద్ద సాయం జరగలేదని, వృద్ధ కళాకారులను ఇకముందైనా ఆదుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. మాను సొంత ఇంటిలా చిన్న కళాకారులు ఫీలవలేకపోయారని ఆ లోటు లేకుండా చూడాలని చెప్పారు. భవిష్యత్ మంచిగా, హెల్దీగా ఉండేలా మా పరిస్థితి ఉండాలని ఆశించారు.