
ప్రభుదేవాకు ఝలక్!
ముంబై: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభుదేవాకు మరో షాక్ తగిలింది. భారీ సినిమా చేసే అవకాశం చేజారినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సీక్వెల్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్ తప్పిపోయినట్టు ‘ముంబై మిర్రర్’ పత్రిక వెల్లడించింది. ‘దబాంగ్ 3’ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం ‘బాగీ’ ఫేమ్ సబీర్ ఖాన్ దక్కినట్టు సమాచారం. దబాంగ్ నిర్మాతలు ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అతడు మూడు, నాలుగు స్ర్కిప్ట్‌లపై పనిచేస్తున్నట్టు సమాచారం.
దీనిపై సబీర్ ఖాన్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘అవును.. దబాంగ్ 3 సినిమా కోసం పని ప్రారంభించాం. కథ పూర్తయ్యే వరకు నేనేమీ చెప్పలేను. చిత్ర యూనిట్‌లో సంప్రదింపులు జరుపుతున్నాను. ఫైనల్ స్ర్కిప్ట్ పూర్తయ్యాక దర్శకుడిగా ఎంపికైతే సంతోషిస్తాన’ని చెప్పారు. దబాంగ్ కథకు ఫ్రీక్వెల్‌గా దబాంగ్ 3 కథ ఉంటుందని ఊహాగాహాలు వస్తున్నాయి. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏక్తా టైగర్కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు.