బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్యం 4’. ఈ సినిమాకు వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి సీక్వల్ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘సినిమా షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్ అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా.
ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్ చెయ్యను. రివైజ్ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్ కమిటీనే కాదు.. ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’ అనని తెలిపారు. ‘ఇంతకన్నా క్రైమ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్ నుంచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment