బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
ముంబై: ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక‌్షన్లను రాబట్టింది.
నోట్ల రద్దుతో చిల్లర దొరక్క చాలా సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం వెనకబడ్డాయి. ఇలాంటి సమయంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే తొలి రోజు కలెక‌్షన్లలో మాత్రం సుల్తాన్ రికార్డులను తిరగరాయలేకపోయింది. సుల్తాన్ తొలి రోజు రూ.33.34 కోట్లు సాధించగా, దంగల్ మాత్రం 29.78 కోట్లు రాబట్టింది. దంగల్ పై వచ్చిన రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా రావడంతో ఆ తర్వాత రోజు నుంచి వసూళ్ల వేగం మరింతగా పెరిగింది. శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆమిర్ ఖాన్ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది.
#Dangal Fri 29.78 cr, Sat 34.82 cr, Sun 42.35 cr. Total: ₹ 106.95 cr [incl Tamil and Telugu]. India biz. FANTABULOUS!
— taran adarsh (@taran_adarsh) 26 December 2016