
స్టార్స్‌కి ఆ సత్తా లేదా?
- దాసరి
‘‘చిన్న చిత్రాలకు ఆడియో, ప్రమోషన్ ఫంక్షన్స్ అవసరం. పెద్ద చిత్రాలకు వాటితో పనిలేదు. సినిమా విడుదలకు ముందే ఆడియో ఫంక్షన్స్, ట్రైలర్స్, కొన్ని సీన్స్ విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. విడుదలయ్యాక ఆ అంచనాలు రీచ్ కాలేక ఇటీవల చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పెద్ద చిత్రాలకు ప్రమోషన్స్ ఎందుకు? థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా స్టార్స్‌కు లేదా? సినిమా ఫ్లాప్ అయితే హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోంది.
సినిమా విడుదలకు ముందు ఎటువంటి ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద చిత్రాల నిర్మాతలను కోరుకుంటున్నా. కొత్తవారితో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సమర్, అక్షిత, కిమయ ప్రధానపాత్రల్లో గుండేటి సతీష్ కుమార్ దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’.
వంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దాసరి ఆవిష్కరించి తెలంగాణ సాంస్కృతికశాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘రంగస్థల నటుడైన ప్రభాకర్‌గారు నిర్మాతగా మారడం అభినందనీయం. సతీష్ కథపై ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నిర్మాతలు చెప్పారు.