
పవన్ తో దాసరి 'బోస్' కల నెరవేరకుండానే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు గతంలో స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వెలువడ్డాయి కూడా.
ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరిగింది. పవన్ దాసరిలకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని దాసరి...చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం సందర్భంగా కూడా ప్రస్తావించారు. అయితే ఇంతలోనే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురవడం... అనంతరం కోలుకున్నారు. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చలు జరిగినప్పటికీ దాసరి హఠాత్ మరణంతో ‘బోస్’ చిత్రం ప్రశ్నార్థకంగా మారింది.