
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: దర్శకరత్న, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మే 4ను 'డైరెక్టర్స్ డే'గా నిర్ణయించడం సంతోషకరమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. దర్శకుడి పేరుకి ఓ బ్రాండ్ తీసుకొచ్చి.. దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన వ్యక్తి దాసరి అని కొనియాడారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాసరి మొదటి సినిమా తాతామనవడు నుంచి వారి సినిమాల్లో కుటుంబ విలువలు, సామాజికి స్పృహ కనిపించేవని, దాసరితో తనకు మంచి అనుబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినీ కుటుంబానికి పెద్దగా దాసరి స్థానం సుస్థిరమని పవన్ అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాకు దాసరి లాంటి కుటుంబ పెద్దల అవసరం ఎంతైనా ఉందన్నారు. దాసరి బాటను అనుసరించినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లని పవన్ పేర్కొన్నారు. రంగస్థలం నుంచి సినిమాలకి వచ్చిన దాసరి.. ఓ నటుడిగా, నిర్మాతగా, రచయితగా సినీ రంగానికి సేవలందించారని చెప్పారు.
కాగా, నేడు దాసరి 71వ జయంతి. శుక్రవారం ఉదయం దాసరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్ సొసైటీ కాంప్లెక్స్‌లో సాయంత్రం దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. దాసరి జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందిస్తూ.. మే 4ను డైరెక్టర్స్ డే ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన పలువురు దాసరి సేవల్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment