తను దూరమయ్యాక వెక్కి వెక్కి ఏడ్చాను
దీపికా పదుకొనే తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకొని కాసేపు కన్నీళ్ల పర్యంతం అయిపోయారు. అంత బాధ కలిగించిన ఆ ఫ్లాష్‌బ్యాక్ ఏంటా! అనుకుంటున్నారా? తన మాజీ ప్రియుడు రణబీర్‌కపూర్ నుంచి తాను విడిపోయిన ఆ క్షణాలు. ఆ సంఘటనను తానెప్పటికీ మరిచిపోలేనంటోంది దీపిక. ఇటీవల ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. నాటి క్షణాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఏడ్చినట్లు తానెప్పుడూ ఏడ్వలేదని సభాముఖంగా చెప్పేశారు. అంతగా బాధ పడ్డారంటే... రణబీర్‌ని మీరు ఏ స్థాయిలో ప్రేమించారో అర్థమవుతోంది? అనంటే- ‘‘దాన్ని ప్రేమ అనాలో ఆకర్షణ అనాలో తెలీదు.
ఎందుకో కానీ బాధేసింది. రణబీర్‌తో అనుబంధం నాకో గొప్ప గుణపాఠం. ఎవర్నీ ఎక్కువగా ఇష్టపడకూడదని, ఎవరిపై ఆధారపడకూడదని అతని విషయంలో నాకు తెలిసిన సత్యాలు. కొన్నాళ్లు గదిలోనుంచి నేను బయటకే రాలేదు. వెక్కి వెక్కి ఏడ్చాను. కోలుకోవడానికి కొన్నాళ్లు పట్టింది. ఏది ఏమైనా నా జీవితంలో రణబీర్‌తో గడిపిన క్షణాలు మరిచిపోలేనివి’’ అని ఉద్వేగానికి గురయ్యారు దీపిక. మళ్లీ మీ ప్రేమ చిగురించే అవకాశం ఉందంటారా? అనంటే- ‘‘ ఆ విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులం... అంతే’’ అన్నారు ముక్తసరిగా దీపిక.