
ప్రేమకు కళ్లెం వెయ్
ప్రేమ జోరుకు కాస్త కళ్లెం వేసి నటనపై దృష్టి సారించాలని కమల్‌హాసన్ మాజీ భార్య సారిక తప రెండో కూతురు అక్షరకు సూచనలు చేశారు. సారిక పెద్ద కూతురు శ్రుతిహాసన్ ముంబాయిలోనే నివశిస్తున్నా ఒంటరిగా ఉంటున్నారు. అక్షర మాత్రం తన తల్లితోనే కలిసి ఉంటున్నారు. తెర వెనుక ఎదగాలనుకున్న ఈ భామ చివరికి తన అక్క బాటలోనే పయనిస్తూ ధనుష్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
అయితే అక్షర అప్పుడే ప్రేమలో మునిగి తేలుతున్నారట. పూర్వపు హీరోయిన్ రతి అగ్నిహోత్రి కొడుకు తనూజ్ విర్వాణితో ప్రేమ పాఠాలు వళ్లిస్తున్నారట. ఈ ప్రేమ జంట తరచూ డేటింగ్ అంటూ షికార్లు చేస్తున్నారట. ప్రతి శనివారం తప్పనిసరిగా తనూజ్‌ను తన ఇంటిలో కలుస్తూ ప్రేమ సాగరంలో తేలిపోతుండటం ఆమె తల్లి సారిక దృష్టికి వచ్చింది. దీంతో ఆమె కూతురిని ప్రేమ జోరు తగ్గించి నటనపై దృష్టి సారించాలంటూ హెచ్చరించారట. అయినా అక్షర తల్లి హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రేమికుడితో చక్కర్లు కొడుతున్నారని బాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.