మామను మించిన అల్లుడు
తమిళసినిమా: మామను మించిన అల్లుడు అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ నటుడు ధనుష్ మామాఅల్లుళ్లన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమరు నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ను దశాబ్దం ముందు సినీరంగప్రవేశం చేసిన ధనుష్ ఎలా మించిపోతారన్న సందేహం మీకు కలగవచ్చు. అయితే ధనుష్ సినీ చరిత్ర తక్కువేమీ కాదు.
ఆయన నటించి, రాసి పాడిన వై దిస్ కొలై వెరిడీ పాటతో ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం పొందారు. ఇక నటుడిగా, కథకుడి, గాయకుడిగా, గీతరచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ధనుష్ తాజాగా తన మామ రజనీకాంత్ హీరోగా చిత్రాన్ని నిర్మించే స్థాయికి ఎదిగారు. కాగా ఇక అసలు విషయానికి వస్తే ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 50 లక్షలు చేరుకుందని ఒక సర్వేలో వెల్లడైంది. ఇన్ని లక్షల మంది ట్విట్టర్ అభిమానులు కలిగిన ఏకైక తమిళనటుడు ధనుష్‌నేనట. రజనీకాంత్ ఆ తరువాత స్థాయికే సరిపెట్టుకున్నారట. ధనుష్‌కు 50లక్షల మంది ట్విట్టర్ అభిమానులుండగా రజనీకాంత్‌కు 30.96 లక్షల మందే ఉన్నారట.
ఆ విధంగా ధనుష్ మామను మించిన అల్లుడు అయ్యారు. ఇక ఆ తరువాత స్థానంలో శివకార్తికేయన్ 30.13 లక్షలు, జీవీ.ప్రకాశ్‌కుమార్ 20.50 లక్షలు, సూర్య 20.12 లక్షలు, శింబు 20.12 లక్షలు, మాధవన్ 20.06 లక్షలు, ప్రభుదేవా 10.36 లక్షలు, కమలహాసన్ 10.31 లక్షల మంది ట్విట్టర్ అభిమానులను కలిగిఉన్నారట. నటుడు ధనుష్ ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారట. మిగతా వారు అవసరం అయినప్పుడే ట్విట్టర్‌లో తమకు సంబంధించిన అంశాలను పోస్ట్ చేస్తుంటారట. 2010 ట్విట్టర్ ఎకౌంట్‌ను ప్రారంభించిన ధనుష్ ఇప్పటి వరకూ 1,965 సార్లు ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారట.