శేఖర్ కమ్ముల ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను! | Dil Deewana movie hero Rohit Interview | Sakshi
Sakshi News home page

శేఖర్ కమ్ముల ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను!

Published Thu, Feb 6 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

శేఖర్ కమ్ముల ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను!

శేఖర్ కమ్ముల ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు చాలామంది. కానీ రోహిత్ మాత్రం లాయర్ కాబోయి యాక్టర్ అయ్యారు. చిన్నప్పట్నుంచీ సినిమాలపై ఉండే అభిమానానికి తోడు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి మరీ ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారు. ‘దిల్ దివానా’తో హీరోగా పరిచయ మవుతున్న రోహిత్ ప్రేక్షకుల దిల్‌లో స్థానం సంపాదించుకుంటానని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రేపు (శుక్రవారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే...
 
 ముందుగా మీ గురించి చెప్పండి?
 మాది నెల్లూరు. నాన్నగారు లాయర్. అన్నయ్య కూడా అదే వృత్తిలో ఉన్నారు. అమ్మ హౌస్ వైఫ్. నేను లా చదువుతున్నాను. ఇంకో సంవత్సరం చదివితే కోర్స్ పూర్తవుతుంది.
 
 నల్ల కోటు వేసుకోవాల్సిన మీరు మేకప్ వేసుకోవడం విచిత్రంగా ఉందే?
 సినిమా పరిశ్రమలో నాకు కొంతమంది స్నేహితులున్నారు. వాళ్లు చేసే సినిమాల షూటింగ్స్‌కి వెళుతుండేవాణ్ణి. అలా, గత నాలుగైదేళ్లుగా సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది. ‘దిల్ దివానా’కి ఆడిషన్స్ జరుగుతున్నాయని నా స్నేహితులు చెబితే ప్రయత్నించాను.
 
 ఇలాంటి ఆడిషన్స్ అన్నీ నిజం కాదని, ప్రకటన ఇచ్చినా రికమండేషన్ ద్వారానే అవకాశాలు వస్తాయన్నది కొంతమంది అభిప్రాయం...?
 ఎక్కడైనా అలా జరిగి ఉండొచ్చేమో. నన్ను మాత్రం ఆడిషన్స్ చేసే ఈ సినిమాకి తీసుకున్నారు. ఎలాంటి రికమండేషన్స్ లేవు. నా శారీరక భాష, ఎత్తు, నా ప్రవర్తన చూసి ఈ సినిమాకి సరిపోతానని చిత్రనిర్మాత రాజారెడ్డిగారు జెన్యూన్‌గా ఎంపిక చేశారు. 
 
 ఈ చిత్రంలో మీరు చేసిన పాత్ర గురించి?
 ‘నిజజీవితంలో నీ ప్రవర్తన, జీవన శైలి ఎలా ఉంటుందో ఈ సినిమాలో హీరో పాత్ర అలానే ఉంటుంది. అందుకని, నువ్వు విడిగా ఎలా ఉంటావో అలా చేస్తే చాలు’ అని చిత్రదర్శకుడు కిరణ్ ముందే చెప్పారు. అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఎవర్నీ అనుకరించే అవసరం లేకుండా నాదైన శైలిలో నేను చేశాను.
 
 నటనలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
 లేదు. మూడు, నాలుగేళ్లు నా స్నేహితులతో పాటు షూటింగ్స్‌కి వెళ్లడంనాకు చాలా ఉపయోగపడింది. కెమెరా ముందు వాళ్లెలా నటిస్తున్నారో ప్రత్యక్షంగా చూశాను. దాంతో షూటింగ్ అంటే భయం పోయింది. పైగా, నేనెలా ఉంటానో ఈ సినిమాలో నా పాత్ర కూడా అలానే ఉంటుంది కాబట్టి, సునాయాసంగా చేసేశాను. షూటింగ్ ప్రారంభించక ముందు ఓ నెల రోజులు శిక్షణ తీసుకున్నాను. స్కూల్, కాలేజ్ డేస్‌లో డాన్స్‌తో పాటు ఇతర ఆటల పోటీల్లో బాగా పాల్గొనేవాణ్ణి. దాంతో ఫిజికల్ ఫిట్‌నెస్ పరంగా కూడా నేను ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం రాలేదు.
 
 సినిమా విడుదలకు ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది. ఎలా అనిపిస్తోంది?
 ఒకింత టెన్షన్, ఎగ్జయిట్‌మెంట్.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నాను. ఇలాంటి స్థితిలో ఉండటం నా జీవితంలో ఇదే మొదటిసారి. నాకు, నిర్మాతకు, దర్శకుడికి ఇది మొదటి సినిమా. కచ్చితంగా ప్రేక్షకులు మాకు విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉంది. 
 
 మీ యూనిట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా రష్ చూశారా?
 దర్శకుడు కిరణ్‌గారు, శేఖర్ కమ్ములగారి దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. శేఖర్ కమ్ములగారు ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశారు. ‘మొదటి సినిమా అయినా బాగానే చేశావు’ అని అభినందించారు. ఆ ప్రశంసను ఎప్పటికీ మరచిపోను.
 
 లా పూర్తి చేస్తారా? సినిమాలకే పరిమితమైపోతారా?
 మరో ఏడాది కష్టపడితే కోర్స్ పూర్తయిపోతుంది. మధ్యలో వదలను.
 
 తదుపరి చిత్రాల గురించి?
 ఇప్పటికే ఒక సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు తెలియజేస్తా.
 
 ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
 నా వయసు తగ్గట్టుగా లవర్ బోయ్ కేరక్టర్స్ చేయాలని ఉంది. ఇంటిల్లిపాదికీ దగ్గరయ్యే పాత్రలను ప్రిఫర్ చేస్తాను.  ‘రోహిత్ మన ఇంట్లో అబ్బాయే’ అని ప్రేక్షకులతో అనిపించుకుంటే చాలు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement