'ఎన్నో రాత్రులు ఆ హీరోలు బాధపడేవారు'
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలైనందుకు దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన సంజయ్ పుణె ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.
సంజయ్ తండ్రి, బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ దత్, దిలీప్ కుమార్ అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సంజయ్ అరెస్టయిన తర్వాత సునీల్ దత్ కుటుంబం ఎంతో బాధపడిందని సైరాభాను గతాన్ని వెల్లడించారు. 'సంజయ్ విడుదలయ్యాడని తెలిసి దిలీప్ సాబ్ చాలా సంతోషపడ్డారు. సంజయ్ అరెస్టయినపుడు సునీల్ దత్ సాబ్ కుటుంబం చాలా బాధపడింది. అప్పట్లో ఎన్నో సార్లు సునీల్ సాబ్, దిలీప్ సాబ్ కలిశారు. రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడుకునేవారు. సంజయ్ విషయం గురించి ఇద్దరూ బాధపడేవారు' అని సైరా భాను ట్వీట్ చేశారు.