కుదుటపడ్డ దిలీప్‌కుమార్.. నేడు డిశ్చార్జి
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం కుదుటపడింది. శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయనను బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఆయన ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయనను డిశ్చార్జి చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు.
ట్రాజెడీ కింగ్‌గా పేరున్న దిలీప్‌కుమార్ తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన భార్య, అలనాటి హీరోయిన్ సైరా బాను అంతకుముందు చెప్పారు. దిలీప్ కుమార్ అసలుపేరు యూసుఫ్ ఖాన్. ఆయన ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ తెరను ఏలారు. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.