సాయికుమార్, ఆది వల్లే ఆ షాక్ నుంచి తేరుకున్నా!
‘ఆ నలుగురు’ సినిమా ఒక్కటి చాలు... రచయితగా మదన్ టాలెంట్ గురించి చెప్పడానికి.
‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో దర్శకునిగా కూడా భేష్ అనిపించుకున్నారాయన.
ఆది, అదా శర్మ జంటగా ఆయన డెరైక్ట్ చేసిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మదన్‌తో జరిపిన భేటీ...
* మీ ఇమేజ్ దృష్ట్యా ‘గరం’ టైటిల్‌తో మీ నుంచి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయలేదు?
(నవ్వుతూ) యాక్చువల్‌గా నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గరం అంటే కోపానికి పర్యాయ పదం అనుకుంటారు. ఇందులో రొమాన్స్ ఉంది. ఆ ఫీల్‌ని కూడా గరం అనొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా అలా అనొచ్చు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి.
* ఈ సినిమా మధ్యలో ఆగడం, ఆ తర్వాత సాయికుమార్ టేకప్ చేయడం.. ఈ ప్రాసెస్ గురించి చెబుతారా?
2014లో ఓ షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమా ఆగింది. ఒక మంచి కథతో తీస్తున్న సినిమా ఆగడం నచ్చక హీరో ఆది తన తండ్రి సాయికుమార్‌ని ఒప్పించి, ఈ చిత్రాన్ని నిర్మించేలా చేశాడు. సాయికుమార్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాక కేక్ వాక్‌లా అయ్యింది. నిర్మాతలు సురేఖ, వసంతా శ్రీనివాస్‌ల సహకారం మర్చిపోలేనిది. ఏది అడిగినా కాదన కుండా సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. మళ్లీ నా కెరీర్‌లో సాయికుమార్ అంతటి బెస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతారో లేదో?
* ఇంతకూ ఆ యాక్సిడెంట్ గురించి చెప్పలేదు?
‘గరం’ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం నా మిత్రుడు నాగిరెడ్డి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, నా రైట్ హ్యాండ్‌లాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనుల మీద వెళుతూ జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయాడు. నేను చాన్నాళ్లు ఆ షాక్‌లోనే ఉండిపోయాను. సాయికుమార్, ఆది, నా కుటుంబ సభ్యులు, మిత్రుల వల్లే ఆ షాక్ నుంచి బయటపడగలిగాను.
ఆది నమ్మకమే స్ఫూర్తిగా...
ఈ సినిమా కోసం ఇటలీలోని గోర్మిటి అనే ఎత్తై ప్రదేశంలో ఒక సీన్ తీశాం. ఎముకలు కొరికే చలి. ఒంటి మీద పల్చని షర్ట్, ఫ్యాంట్‌తో ఆది ఆ సీన్ చేయాలి. మేమంతా కింద ఉన్నాం. తను పైకి ఎక్కాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ అక్కడే నిలబడ్డాడు. వాతావరణం అనుకూలించక ఆ రోజు షాట్ తీయలేదు. మర్నాడు మేం ఎక్కడ ఆ షాట్ వద్దంటామేమోనని ముందే కొండ ఎక్కేశాడు. అంత డెడికేషన్. ఈ చిత్రంపై ఆది పట్టుదల, నమ్మకం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచాయి. కచ్చితంగా మా అందరికీ మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది.
* మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే దర్శకుడు మీరు. మరి.. ఆదిలాంటి కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా?
‘పెళ్లైన కొత్త’లోని తీసుకుంటే.. వైవాహిక అనుబంధాన్ని కమర్షియల్‌గానే డీల్ చేశాను. బేసిక్‌గా నేను సోల్ లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడను. ‘గరం’ ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. వరాలు పాత్రను ఆది నరనరాన జీర్ణించు కుని చేశాడు. ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా ఆది బాగా డ్యాన్సులు, ఫైట్లు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నటనాపరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆది హార్డ్ వర్క్, నమ్మకమే ఈ సినిమా.
* సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు.. కారణం ఏంటి?
ఒకానొక దశలో సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దానికో కారణం ‘ప్రవరాఖ్యుడు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. ఆ సినిమా విడుదలైన రెండో రోజుకే రాజకీయాలపరంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికి ఆంధ్రా సైడ్ మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. ఒక మంచి సినిమా అలా ఇగ్నోర్ అయిపోయినందుకు బాధపడ్డా. సినిమాలు ఎందుకులే? అనుకోవడానికి అదో కారణం. ఆ తర్వాత చేసిన రెండు వ్యాపారాలు వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా పరిశ్రమే కరెక్ట్ అనిపించింది.
* మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే బాధ ఏదైనా ఉందా?
మొదట్లో ఉండేది. ఆ తర్వాత అలా ఆశించడం సరికాదని తెలుసుకున్నా. గుర్తింపు రావడం అంటే ఏంటి? నలుగురూ అభినందించడమే కదా. ఇప్పుడు నేనో మంచి సినిమా చూశాననుకోండి.. ‘బాగుంది’ అనుకుంటాను తప్ప స్వయంగా ఫోన్ చేసి చెప్పను. అంటే.. ఆ సినిమా తీసినవాళ్లకు గుర్తింపు లేనట్లా? అలాగే నాకు స్వయంగా ఫోన్ చేయకపోయినా మనసులో అభినందించి ఉండొచ్చు. అసలెవరూ గుర్తించకపోతే అప్పుడు మన ఎఫర్ట్‌లో లోపం ఉన్నట్లు లెక్క.
* మీ తదుపరి చిత్రాలు?
‘గరం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకి వచ్చే మార్కెట్‌ని బట్టి నాకు ఫోన్ కాల్స్ వస్తాయి (నవ్వుతూ).