ఆల్ ది బెస్ట్
పరీక్షలు బాగా రాసినప్పుడు ఫలితం బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. ఆది ఆ నమ్మకంతోనే ఉన్నారు. అదా శర్మతో కలిసి మదన్ డెరైక్షన్‌లో ‘గరం’ అనే పరీక్ష రాశారు ఆది. ఈ చిత్రాన్ని పరీక్ష అని ఆది ఎందుకు అంటున్నారంటే కథ విపరీతంగా నచ్చి, తన తండ్రి సాయికుమార్‌ని ఒప్పించి, నిర్మించేలా చేశారు. వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై పి. సురేఖ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ - ‘‘ఆది నటించిన 7వ చిత్రమిది. తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. తొలిసారి అమెరికా, కెనడాలో ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది.
2016వ సంవత్సరం చాలా మంచి ఊపుతో మొదలైంది. కొత్త ఏడాదిలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అన్ని సినిమాలూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాణ్ణి నేను’’ అన్నారు. ‘‘మంచి సినిమా చేశాం. విడుదల దగ్గర పడుతోంటే నెర్వస్‌గా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. సినిమా సమస్యల్లో ఉన్నప్పుడు నాన్న నా భుజం తట్టి ప్రోత్సహించారు. చిత్రం చూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ కారు’’ అని ఆది పేర్కొన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ‘‘పదహారు రకాల కూరలతో విందు భోజనం చేసినట్లుంటుందీ చిత్రం.
ప్రతి ప్రేక్షకుడూ ఈ కథలో తనను తాను చూసుకుంటాడు. నేను చేసిన తండ్రి పాత్రకు మంచి పేరొస్తుంది. ఫ్యామిలీస్‌తో అందరూ చూసే మంచి సినిమా ఇది. సాయికుమార్ ‘బెస్ట్ ఫాదర్’. ఆది అందమైన హీరో. మంచి మనసున్న వాడు. కెరీర్‌వైజ్‌గా తనను మరో పదిమెట్లు ఎదిగేలా చేసే సినిమా ఇది. అతని కెరీర్ బెస్ట్‌ఫిల్మ్‌కు నా ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. అదా శర్మ, సహ నిర్మాత బాబ్జీ పాల్గొన్నారు. సంగీతం: అగస్త్య, కెమెరా: సురేందర్ రెడ్డి.