
తమిళసినిమా: వంజకర్ ఉలగం రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్స్ కథా చిత్రంలా ఉండదని ఆ చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్ అంటోంది. చాలా మంది ఇతర చిత్రాల తారల మాదిరిగానే కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కన్నడ నటి ఈ అమ్మడు. కన్నడంలో గర్వ, మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన మన్మధ వంటి చిత్రాల్లో నటించిన అనీషా వంజగర్ ఉలగం చిత్రంతో నాయికిగా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలుపుతూ వంజగర్ ఉలగం చిత్రం అవుట్ పుట్‌తో చిత్రయూనిట్ అంతా సంతృప్తిగా ఉందని చెప్పింది. అయితే తనకు మాత్రం ఇది చాలా స్పెషల్ అని పేర్కొంది. వార్తలను సేకరించే పనిలో ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన విలేకరి పాత్రలో తాను నటించానని చెప్పింది.
ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డానన్నదే తన పాత్ర అని తెలిపింది. ఇది హైపర్‌లింక్ కథాంశంతో కూడిన చిత్రం అని పేర్కొంది. ఒకే సమయంలో జరిగే పలు కథల ఇతివృత్తంగా వంజకర్ ఉలగం చిత్రం ఉంటుందని చెప్పింది. ఇది గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల మాదిరిగా ఉండదని అంది. ప్రేమ కథా చిత్రాలు పలు కోణాల్లో ఎలాగైతే తెరకెక్కుతాయో, ఈ వంజగర్ ఉలగం చిత్రం వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు మరోజ్ బీధ తనకు స్కైప్ ద్వారా చెప్పారని, కథ వినగానే ఆయన తాను ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూసి ఉంటారా? అన్న ఆశ్చర్యం కలిగిందని చెప్పింది. కారణం నటనకు అవకాశం ఉన్న అలాంటి పాత్రకు తనను ఎంచుకోవడంతో తనకు అలా అనిపించిందంది. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి అంతా సక్రమంగా జరుగుతూ వచ్చిందని, ఈ చిత్రంలో నటించిన ప్రతిరోజూ సంతోషంగా సాగిందని అనీషా చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రల్లో సిబి భువన్ చంద్రన్, హరీశ్ పేరడి, గురు సోమసుందరం, చాందిని తమిళరసన్, విశాగన్ వనంగాముడి, జాన్‌విజయ్, వాసు విక్రమ్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లాభిరింద్ ఫిలింస్ పతాకంపై మంజులా బీదా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment