ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ వంటి కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలతో పాటు గంగ పుత్రులు లాంటి సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో సందేశాత్మక చిత్రం గల్ఫ్. పొట్ట కూటి కోసం దేశం విడిచి వెళ్లిన గల్ఫ్ వలస బాధితుల కష్టాలే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తెలంగాణకు చెందిన నేత కార్మికుడి కొడుకు శివ (చేతన్). తన స్నేహితుడు దుబాయ్ వెళ్లి బాగా సంపాదించడంతో తాను కూడా అలాగే డబ్బు సంపాదించాలనుకుంటాడు. అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా.. గల్ఫ్ బాట పడతాడు. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతోనే లక్ష్మీ (డింపుల్ హయాతి) కూడా దుబాయ్ వెళుతుంది. గల్ప్ ప్రయాణంలోనే పరిచయం అయినా శివ, లక్ష్మీలు ప్రేమలో పడతారు. ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగు పెట్టిన శివకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. తానే కాదు అక్కడ లక్షల మంది భారతీయులు ఇలాగే శ్రమదోపిడీకి గురవుతున్నారన్న నిజం తెలుసుకుంటాడు. డబ్బు ఆశతో గల్ఫ్ బాట పట్టిన మన వారి బతుకులను పరిచయం చేయటమే ఈ సినిమా కథ.
యదార్థ పరిస్థితులను కథాంశంగా ఎంచుకున్న సునీల్ కుమార్ అక్కడే సగం విజయం సాధించాడు. గల్ప్ లో జీవితాల గురించి యువత ఎలాంటి కలలు కంటుంది. నిజంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లటం మూలంగా బ్రోకర్లు, అరబ్బుల చేతుల్లో మనవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్న విషయాలను చాలా బాగా చూపించారు. గల్ప్ లోని లోకేషన్లో చిత్రీకరణ చేయటం వలన సినిమా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరో హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుంది.
అయితే ఫస్ట్ అంతా ఎంతో బలంగా రాసుకున్న దర్శకుడు ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. దుబాయ్ లో మోసపోయిన హీరో ఎదురుతిరిగిన తరువాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఒకే తరహా కష్టాలను మళ్లీ మళ్లీ చూపించటం కూడా కాస్త విసిగిస్తుంది. పాజిటివ్ గా ముగుస్తుందనుకున్న సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇవ్వడం కూడా ఇబ్బంది పెడుతుంది. పులగం చిన్నారాయణ అందించిన డైలాగ్స్ అక్కడక్కడా మెరిశాయి. సంగీతం, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద గల్ఫ్ మరోసారి సునీల్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన మంచి ప్రయత్నమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment