సాయిపల్లవి నో అంది! | Director Vijay Speech at Karu Audio Launch | Sakshi
Sakshi News home page

సాయిపల్లవి నో అంది!

Published Sun, Feb 25 2018 5:04 AM | Last Updated on Sun, Feb 25 2018 5:04 AM

Director Vijay Speech at Karu Audio Launch - Sakshi

తమిళసినిమా:  కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ చెప్పారు. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గానూ నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్‌ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్‌ ఆంటోని ముఖ్యపాత్రలను పోషించారు. శ్యామ్‌.సీఎస్‌ సంగీతబాణీలు కట్టిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి మాట్లాడుతూ అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేసిన నటిని తానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి చేర్చారని అన్నారు. తన తొలి చిత్రాన్నే (ప్రేమమ్‌ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు.

దర్శకుడు విజయ్‌ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పగా ఎప్పుడు చేసినా ఈ కథను లైకా సంస్థకే చేయాలని ఆ సంస్థ అధినేత అన్నారని చెప్పారు.

ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామని, ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవినేనని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్‌ అన్నారు.
కరు చిత్ర ఆడియో ఆవిష్కరణ దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement