
'సన్నబడాలంటే కడుపు మాడ్చుకోను'
బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ ఈ మధ్య కాస్త సన్నబడింది. ఫెమినా కవర్ పేజీ మీద ఫొటో కోసం బాగా నాజూగ్గా తయారవుతోంది. అయితే.. దీనికోసం తాను కడుపు మాత్రం మాడ్చుకోవట్లేదని ఆమె స్పష్టంగా చెబుతోంది. ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారానే ఇవన్నీ సాధిస్తున్నట్లు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమాలో ఆమె వంపుసొంపులు చాలా కొత్తగా కనిపించాయి. ఇందుకోసం తాను తిండిని మాత్రం మానుకోలేదని హుమా స్పష్టంగా చెప్పింది. తనకు ఆహారం అంటే చాలా చాలా ఇష్టమని, ప్రతి పదినిమిషాలకోసారి తన ట్రైనర్ తనకు బ్రేక్ ఇచ్చి, తనకు ఏం కావాలంటే అది తినమంటారని తెలిపింది.
అయితే, ఇప్పుడు తాను జంక్ ఫుడ్ తినడం మాత్రం మానేశానని, దాదాపు ప్రతిరోజూ యోగా చేయడం, వ్యాయామాలు, కొంత వరకు పరుగు తీయడం అలవాటు చేసుకున్నానని వివరించింది. సన్నబడటం కోసం ఒకేసారి తిండి మానేయడం సరికాదని, అది చాలా అనారోగ్యకరం అవుతుందని హుమా అంటోంది. ఫెమినా కవర్ పేజీమీద కనిపించడం అంటే అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమని, అలాంటి అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని సంబరపడుతూ చెప్పింది.