ప్లీజ్... ఆ ఒక్కటీ అడక్కండి!
ప్లీజ్... ఆ ఒక్కటీ అడక్కండి!
Published Sun, Jan 5 2014 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్లిన్‌లు విడిపోవడానికి తానే కారణమంటూ వచ్చిన వదంతులపై నటి హుమా ఖురేషి పెదవి విప్పడం లేదు. అనురాగ్ కశ్యప్, హ్యుమా ఖురేషిల మధ్య సాన్నిహిత్యం కారణంగానే కల్కి కొచ్లిన్ భర్త నుంచి విడిపోయిందంటూ బాలీవుడ్‌లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాలో తన నటనా కౌశలంతో విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలందుకున్న హుమా ఖురేషి...ఈ వదంతులను కొట్టిపారేసింది.
ఈ విషయమై మీడియా ప్రశ్నించగా ‘అనురాగ్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. నేనేమి చెప్పదలుచుకున్నానో అది ఇప్పటికే చెప్పా. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు’ అని కుండ బద్దలుకొట్టింది. ఇదిలాఉంచితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానే దంపతులు విడిపోయారు. వీరి వివాహబంధం తెగిపోవడానికి అర్జున్ రాంపాల్ కారణంగా కనిపిస్తోంది. అయితే సుజానేతో తనకు సంబంధం లేదని అర్జున్ ప్రకటించినప్పటికీ అనురాగ్ విషయంలో హుమా ఖురేషి తేల్చిచెప్పడం లేదు.
‘ఇతరుల జీవితాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది సమంజసం కూడా కాదు. ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే ఎప్పుడో మాట్లాడేదాన్ని. నా వైఖరేమిటనేది ఎప్పుడో వెల్లడించా. ఇప్పుడిక కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు’ అని హుమా తెలిపింది. ‘నాకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తల గురించి బాధపడను. అయితే మా కుటుంబం ప్రతిస్పందన విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. నా కుటుంబీకులకుగానీ లేదా నా తమ్ముడు కుటుంబీకులపైగానీ ప్రభావం చూపుతుందేమోననేదే నా బాధంతా’ అని అంది. కాగా దేడ్ ఇష్కియా సినిమాలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌తో పాటు హుమా ఖురేషి కనిపించనుంది.
Advertisement
Advertisement