Gangs of Wasseypur
-
పెద్ద స్టార్‌నన్న గర్వంతో కండీషన్స్ పెట్టా.. చివరకు గుణపాఠం చెప్పారు!
ఒక్కసారి స్టార్‌డమ్‌ను తలకెక్కించుకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎలాగో స్టార్‌ను అయ్యాను కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరితే మొదటికే మోసం వస్తుంది. అందుకు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్ ప్రత్యక్ష ఉదాహరణ. స్టార్డమ్తో గర్వాన్ని తలకెక్కించుకోవద్దని ఓ సంఘటన తనకు గుణపాఠం చెప్పిందంటున్నాడు రవి కిషన్. తాజాగా ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేనేమో పెద్ద స్టార్‌నన్న గర్వంతో.. రోజూ పాలతో స్నానం చేస్తా, గులాబీ పూల రెక్కలపై నిద్రిస్తా.. అవన్నీ మీరే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఎందుకంటే నేను స్టార్‌ను, ఇలాంటివి మినిమమ్ ఉండాలి కదా అన్న భ్రమలో ఉన్నాను. అప్పుడు జనాలు నా గురించి మాట్లాడుకుంటారని ఊహించాను. కానీ నేను అనుకుంది ఒకటైతే జరిగింది మరొకటి. నన్ను గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్లో తీసుకోలేదు. నాకోసం రోజూ 25 లీటర్ల పాలు ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు. నా డిమాండ్లు నాకే హాని తలపెట్టాయి. కాబట్టి అప్పటినుంచి అలాంటి డిమాండ్లు చేయడం మానేశాను. ఏమీ లేని స్థాయి నుంచి వచ్చినప్పుడు సడన్‌గా డబ్బు, పేరుప్రతిష్టలు వచ్చినప్పుడు మనసును నియంత్రించడం చాలా కష్టం. ముంబైలాంటి నగరం ఎవరినైనా పిచ్చోళ్లను చేస్తుంది. అందులో నేనూ ఒకడిని. అందుకే నేను నాపై నియంత్రణ కోల్పోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా రవి కిషన్.. భోజ్‌పురి ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం విలన్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు. -
‘ఆరోజే నా జీవితం నాశనమైంది’
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున తన జీవితం నాశనమైందని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనోజ్ బాజ్‌పేయ్, రిచా చద్దా, రీమాసేన్ తదితర తారాగణంతో తెరకెక్కిన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అనురాగ్ కశ్యప్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. బొగ్గు మాఫియా అక్రమాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులు తనను చూసే విధానం మారిందని కశ్యప్ పేర్కొన్నాడు. ఈ మూవీ మొదటి భాగం విడుదలై ఏడేళ్లు పూర్తైన సందర్భంగా...‘ ఏడేళ్ల క్రితం సరిగ్గా ఈరోజునే నా జీవితం పూర్తిగా నాశనమైంది. అప్పటి నుంచి ప్రేక్షకులు నా నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు. కానీ నేను వారి అంచనాలను అందుకోలేకపోతున్నాను. ఏదైతేనేం 2019 నాటికి సాడే సాతీ పూరైంది’ అంటూ అనురాగ్ కశ్యప్ చమత్కరించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. కాగా గత కొంతకాలంగా అనురాగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మర్జియాన్’ ప్రేక్షకులను నిరాశపరిచింది. -
అలసిపోయా.. అందుకే చెయ్యట్లేదు: శిల్పా
అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడి నుంచి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఓ నటి మాత్రం తాను నటించలేను.. వద్దనేసింది. చక్ దే ఇండియా, ఖామోష్ పానీ లాంటి చిత్రాల్లో నటించి.. మంచి పేరు సంపాదించుకున్న శిల్పా శుక్లా కేవలం విశ్రాంతి కోసం 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సినిమాలో నటించనని తెగేసి చెప్పింది. తాను బాగా అలసిపోయానని, బెనారస్‌కు వెళ్లి అక్కడ కొంతకాలం పాటు ఉన్నానని, కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాలనే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తాను ఒప్పుకొన్న 'కఫిన్ మేకర్' చిత్రాన్ని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానని శిల్పా (32) చెప్పింది. వరుసపెట్టి సీరియస్ పాత్రలు చేసిన తర్వాత.. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తోంది. ఇప్పుడు తాను వరుసగా రెండు కామెడీ చిత్రాల్లో నటిస్తున్నానని, దాంతో ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ మారుతుందని అంటోంది. మరోవైపు లడఖ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని కూడా ఆమె ఆస్వాదించింది. అక్కడ ప్రదర్శించే ఇరానీ చిత్రాలను చూడాలని భావిస్తున్నట్లు తెలిపింది. -
ప్లీజ్... ఆ ఒక్కటీ అడక్కండి!
దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, కల్కి కొచ్లిన్లు విడిపోవడానికి తానే కారణమంటూ వచ్చిన వదంతులపై నటి హుమా ఖురేషి పెదవి విప్పడం లేదు. అనురాగ్ కశ్యప్, హ్యుమా ఖురేషిల మధ్య సాన్నిహిత్యం కారణంగానే కల్కి కొచ్లిన్ భర్త నుంచి విడిపోయిందంటూ బాలీవుడ్లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాలో తన నటనా కౌశలంతో విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలందుకున్న హుమా ఖురేషి...ఈ వదంతులను కొట్టిపారేసింది. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా ‘అనురాగ్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. నేనేమి చెప్పదలుచుకున్నానో అది ఇప్పటికే చెప్పా. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు’ అని కుండ బద్దలుకొట్టింది. ఇదిలాఉంచితే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానే దంపతులు విడిపోయారు. వీరి వివాహబంధం తెగిపోవడానికి అర్జున్ రాంపాల్ కారణంగా కనిపిస్తోంది. అయితే సుజానేతో తనకు సంబంధం లేదని అర్జున్ ప్రకటించినప్పటికీ అనురాగ్ విషయంలో హుమా ఖురేషి తేల్చిచెప్పడం లేదు. ‘ఇతరుల జీవితాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది సమంజసం కూడా కాదు. ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే ఎప్పుడో మాట్లాడేదాన్ని. నా వైఖరేమిటనేది ఎప్పుడో వెల్లడించా. ఇప్పుడిక కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు’ అని హుమా తెలిపింది. ‘నాకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తల గురించి బాధపడను. అయితే మా కుటుంబం ప్రతిస్పందన విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. నా కుటుంబీకులకుగానీ లేదా నా తమ్ముడు కుటుంబీకులపైగానీ ప్రభావం చూపుతుందేమోననేదే నా బాధంతా’ అని అంది. కాగా దేడ్ ఇష్కియా సినిమాలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌తో పాటు హుమా ఖురేషి కనిపించనుంది.