
ముంబై: తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిరాధారమైనవని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. 2013లో డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసుల నుంచి బుధవారం సమన్లు అందుకున్న కశ్యప్, తన లాయర్ ప్రియాంక ఖిమానీతో కలిసి గురువారం ఉదయం వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పాయల్ ఫిర్యాదు మేరకు అనురాగ్ కశ్యప్‌కు పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు నటి పాయల్... కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో కలిసి మహారాష్ట్ర‍్ర గవర్నర్ బీఎస్ కోస్యారీని కలిశారు. కశ్యప్‌ను త్వరితగతిన అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరారు. అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయడంలో తాత్సారం చేయడంపై పోలీసులను ఆమె ప్రశ్నించారు. కశ్యప్‌ను అరెస్టు చేయకుంటే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పాయల్ వెల్లడించారు. (చదవండి: బయటపెట్టండి.. బయటపడండి!)
ఇక రామ్‌దాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ బాధిత నటికి ప్రాణహాని ఉన్నందున ఆమెకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాయల్ కు న్యాయం జరిగేలా, సినీ నిర్మాత కశ్యప్‌ను అరెస్టు చేసేంత వరకు ఆమెకు ఆర్‌పీఐ రక్షణగా ఉంటుందని చెప్పారు. 2013లో ప్రముఖ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచార యత్నం చేసినట్లుగా పాయల్ ఆరోపణలు చేశారు. ‘తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే డైరెక్టర్లు చెప్పినట్లు చేయాల్సిందేనని, అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. (నా పేరెందుకు వాడారు?: నటి)
ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై పాయల్ చేసిన లైంగిక ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని అందులో పేర్కొన్నారు. సదరు అరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, తప్పుడువని కొట్టి పారేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ ఆరోపణలున్నాయని, మీటూ వంటి ఉద్యమాన్ని ఇవి పక్కదోవ పట్టిస్తాయని తెలిపారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న కారణంగా నిజమైన అత్యాచార బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. తన క్లయింటు దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తారని అనురాగ్ లాయర్ వెల్లడించారు. (ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్ )
ఇక బాధిత నటి తమపై చేసిన ఆరోపణలపై రిచా చద్దా, హ్యుమా ఖురేషీ స్పందించారు. ఆరోపణలు చేసిన నటికి రిచా చద్దా లీగల్ నోటీసులు పంపించారు. ఇక బాధిత నటిపై హ్యూమా ఖురేషీ ఘాటుగా స్పందించారు. అనురాగ్ కశ్యప్ తనతోనే కాదనీ, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కాదని ఆమె తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment