
కన్నీళ్లే దారి చూపుతాయి!
తల్లిదండ్రులు కనే కలలు మంచివేగానీ, వాటిని మోసే శక్తి పిల్లలకు ఉందా లేదా అనేది ముఖ్యం. న
హుమా ఖురేషి, బాలీవుడ్ హీరోయిన్
8 పాయింట్స్
భారం
తల్లిదండ్రులు కనే కలలు మంచివేగానీ, వాటిని మోసే శక్తి పిల్లలకు ఉందా లేదా అనేది ముఖ్యం. నన్ను మెడిసిన్ చదివించాలనేది అమ్మ కోరిక. ఆమె కోరిక ప్రకారం కోచింగ్ కూడా తీసుకున్నాను. అలా కోచింగ్ తీసుకునే క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. ‘ఇక నా వల్ల కాదు’ అని చేతులెత్తేశాను.
ఫలితం
ప్రయత్నించడం మంచిదేగానీ, ఎంతకీ ఒక పట్టాన ఫలితం దొరకనప్పుడు ఆ ప్రయత్నాల నుంచి తప్పుకోవడం మంచిది. లేకుంటే సమయం వృథా అవుతుంది. మనసు పాడై పోతుంది.
చురుకుదనం
చురుకుదనం అనేది ఖాళీగా కూర్చోవడం వల్ల రాదు. ఎంత బిజీగా ఉంటే అంత చురుకుదనం వస్తుంది. కాలేజీ రోజుల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలలో, డాక్యుమెంటరీ, కాలేజీ మ్యాగజైన్ పనులలో పాల్గొనడం ద్వారా ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. అలా చురుగ్గా ఉండేదాన్ని.
గతం
ఎప్పుడూ ముందు చూపే కాదు, వెనక చూపు కూడా ఉండాలి. ముందు కనిపించే విజయం మాత్రమే కాదు..మన కష్టాలు కూడా మనల్ని మరింత ముందుకు నడిపిస్తాయి. మా నాన్న ఇప్పుడు ఢిల్లీలో తొమ్మిది రెస్ట్టారెంట్లకు యజమాని. అయితే ఆయన తాను ఆర్థికంగా బలహీనంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. ఒకప్పుడు ఆయన చిన్న రేకుల షెడ్డులో కబాబులు అమ్మేవారు.
మార్గం
మనం కనే కల గట్టిదయితే, కన్నీళ్లేదారి చూపుతాయి. నేను పుట్టి పెరిగిన ఢిల్లీ నుంచి ముంబాయికి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఎప్పుడూ లేని ఒంటరితనాన్ని చవి చూశాను. కొన్ని విషయాల్లో ఇబ్బందిపడ్డాను. అయితే అవేమీ శాశ్వతంగా నిలిచిపోలేదు.
బాధ్యత
బాధ్యతను మనుషులే కాదు పరిస్థితులు కూడా నేర్పిస్తాయి. ఢిల్లీలో ఉన్నప్పుడు డబ్బు విపరీతంగా ఖర్చు చేసే దాన్ని. ముంబాయిలో మాత్రం పరిస్థితులే పొదుపు నేర్పించాయి. డబ్బులు మిగుల్చుకోవడం కోసం బస్సులో వెళ్లకుండా నడిచి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి.
పరిపూర్ణం
నేను పరిపూర్ణమైన వ్యక్తిని అని చెబుతుంటారు. నేను అలా ఎప్పుడూ చెప్పను. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. వాటిని దిద్దుకుంటూ పోవడమే జీవితం. ‘నాలో తప్పులు లేవు’ అనుకోవడం పెద్ద తప్పు.
అతి ఆత్మవిశ్వాసం
ప్రశంసల ప్రభావం కావచ్చు, అతి ఆత్మవిశ్వాసపు మోతాదు కావచ్చు ‘నేనేమీ నేర్చుకోవాల్సి అవసరం లేదు. నాకు తిరుగే లేదు’ అనే పరిస్థితి ఒకటి వస్తుంది. అలాంటి పరిస్థితికి దరి చేరకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ‘నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకుంటున్నాను.