
వెండితెరకు సన్నీ లియోన్ జీవితం
గతం గతః అంటాం కానీ.. గతం ఎప్పుడూ వెంటాడుతుంటుంది. అలా, సన్నీ లియోన్ గతం ఆమెను ఇప్పటికీ వదిలిపెట్టలేదు. విదేశాల్లో ఉన్నప్పుడు నీలి చిత్రాల్లో నటించారామె. అప్పట్నుంచీ ఆమె పై ‘నీలి చిత్రాల తార’ అనే ముద్ర పడింది. ఆ సినిమాలు మానుకున్నా ఆ ముద్ర మాత్రం అలానే ఉండిపోయింది. ప్రస్తుతం దక్షిణ, ఉత్తరాది భాషల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సన్నీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందింది. సన్నీ అంటే.. కేవలం నీలి చిత్రాల తార మాత్రమే కాదు.. ఆమె జీవితంలో అంతకు మించిన విషయాలు బోల్డన్ని ఉన్నాయట.
వాటి సమాహారంతో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా సోదరుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ భర్త డానియెల్ పేర్కొన్నారు. సన్నీ జీవితంలోకి డానియెల్ రాకముందు.. అతనొచ్చిన తర్వాత సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. సన్నీ, డానియెల్ పాల్గొనగా 18 నెలల పాటు చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ‘సన్‌డాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.