మగాళ్లేనా షేవింగ్ చేసుకునేది?
గడ్డం పెరుగుతుంది కాబట్టి... మగాళ్లు షేవింగ్ చేసుకుంటారు. అది కామన్. మరి గడ్డం అడ్డంగా లేకపోయినా... ఆడాళ్లు షేవింగ్ చేసుకుంటే... దాన్ని ఏమంటారు? సింపుల్‌గా ‘మెంటల్’ అంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సోనమ్‌కపూర్‌ని ఉద్దేశించి అందరూ అదే అంటున్నారు. షేవింగ్ క్రీమ్‌ని గడ్డానికి పూసేసుకొని రేజర్‌తో షేవ్ చేసుకుంటూ ఫొటో షూట్ చేయించుకున్నారు సోనమ్. ఈ ఫొటో షూట్ చేసిన ఫొటోగ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠ... వాటిని తిన్నగా తీసుకెళ్ళి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకున్నాడు. అంతే... నిదానంగా సోనమ్ షేవింగ్ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి.
ఈవిడగారి వైనం చూస్తుంటే... మగాళ్లు షేవింగ్ చేసుకుంటున్నట్లే ఉందని, ‘పిచ్చిమాతల్లి పచ్చడంతా తిన్నది’ అన్న సామెత గుర్తొస్తుందని ఓ రేంజ్‌లో సోనమ్‌పై ఇంటర్నెట్‌లో జోకులు పేలుతున్నాయి. కొందరైతే... ఓ అడుగు ముందుకేసి సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ మీద కూడా జోకులు పేలుస్తున్నారు. దీనిపై సోనమ్ స్పందిస్తూ -‘‘మగాళ్లలా లేడీస్ కూడా షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అని సరదాగా చేసిన పని అది. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? నాపై ఎన్ని జోకులేసినా నేను ఫీలవ్వను. నాన్న గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఊరుకోను ఖబడ్దార్’’ అని వార్నింగులు జారీ చేశారు సోనమ్. ఇంతకీ ఈ షేవింగు వ్యవహారం అనిల్‌కపూర్‌కి తెలిసిందో లేదో?!