
‘ఐ లవ్ యూ’ చిత్రంలో ఉపేంద్ర
కొన్నినెలల కిందట శాండల్‌వుడ్‌ను లైంగిక వేధింపుల మీ టూ సంక్షోభం కుదిపేయడం తెలిసిందే. తాజాగా సార్వత్రిక ఎన్నికల నియమావళి చిత్రసీమకు నిద్ర లేకుండా చేస్తోంది. నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే నటీనటుల చిత్రాలను కోడ్ సమయంలో విడుదల చేయడానికి వీల్లేదు. ఫలితంగా ఈ ఏప్రిల్‌లో రాబోయే పలు భారీ సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోవచ్చు.
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌కు ఎన్నికల కోడ్ సెగ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయదలచిన నటుల సినిమాల విడుదలకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ఉపేంద్ర, ప్రకాశ్‌రాజ్, సుమలతా, నిఖిల్ నటించిన సినిమాలు ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీరు నటించిన చిత్రాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
ఏయే సినిమాలు
♦ ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్ యూ’, సుమలతా అంబరీశ్ నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’, నిఖిల్ కుమార, దర్శన్ కాంబినేషన్‌లో‘కురుక్షేత్ర’, ప్రకాశ్ రాజ్ నటిస్తున్న కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది.
♦ ఉపేంద్ర చిత్ర ‘ఐ లవ్ యూ’ చిత్రాన్ని మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్మాత, దర్శకుడు ఆర్.చంద్రు సిద్ధమవుతున్నారు. కోడ్ నేపథ్యంలో విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తెలుగులో ఆలస్యమయినా ఫర్వాలేదు కానీ కన్నడలో విడుదల ఆసల్యమైతే ఇబ్బందులు తప్పవని నిర్మాత యోచనలో పడ్డారు. ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీని నిలపబోతున్న సంగతి తెలిసిందే.
♦ సీఎం తనయుడు నిఖిల్ మండ్య లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి నిలబడడం దాదాపు ఖాయమైంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.
♦ సుమలత నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. ఆమె ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. పోటీపై సందిగ్ధం కొనసాగుతోంది. దీంతో చిత్ర విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి.
ప్రకాశ్‌రాజ్ సినిమాలు సైతం
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్నారు. ఆయన నటించిన కొన్ని తెలుగు, తమిళ ప్రముఖ చిత్రాలు విడుదలపై జాప్యం నెలకొంది. చాలా చిత్రాల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించినవే కావడం విశేషం. ఆ చిత్రాలు కర్ణాటకలోనూ విడుదలయ్యేవే. ఎన్నికల నియమావళితో వీటికి బ్రేక్‌పడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment