‘ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్)‌’ మూవీ రివ్యూ | F2 Fun & Frustration Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 12 2019 12:50 PM | Last Updated on Mon, Jan 14 2019 1:16 PM

F2 Fun & Frustration Telugu Movie Review - Sakshi

టైటిల్ : ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : దిల్‌ రాజు

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎఫ్‌ 2. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య రిలీజ్‌ అయ్యింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన సినిమాలకు డివైడ్‌ టాక్‌ రావటంతో ఎఫ్‌ 2 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌లో కనిపించటం, వరుణ్‌ తేజ్‌ తొలిసారిగా మల్టీస్టారర్‌ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్‌ 2 అందుకుందా..?

కథ‌ :
వెంకీ (వెంకటేష్‌) ఓ ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీకి అమ్మా నాన్న లతో పాటు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు  కూడా లేకపోవటంతో హారిక (తమన్నా) వెంకీని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్‌). కాలేజ్‌లో చదువుకుంటున్న హనీని వరుణ్‌ యాదవ్‌( వరుణ్‌ తేజ్‌) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్‌, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్‌లలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్లభేరానికి వస్తారని అనుకుంటారు. కానీ హారిక, హనీలు యూరప్‌లోనే ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతారు. ఈ పరిస్థితుల్లో వెంకీ, వరుణ్‌లు ఏం చేశారు..? తిరిగి తమ భార్యలకు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ.


న‌టీన‌టులు :
చాలా కాలం తరువాత వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పర్ఫామెన్స్‌, డైలాగ్‌ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ పర్ఫామెన్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్‌ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా మెప్పించినా.. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది.  కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్‌గా అలరించింది. ఫస్ట్ హాఫ్‌లో మరో హీరోయిన్‌మెహరీన్‌ నటన కాస్త అతిగా అనిపించినా తరువాత తరువాత పరవాలేదనిపిస్తుంది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేష‌ణ‌ :
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అనిల్‌ రావిపూడి ఈ పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్‌ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్‌ మార్క్‌ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్‌ రైడ్‌లా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంలో కాస్త నెమ్మదించాడు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్‌ ఆలోచింప చేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్‌ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఎడిటింగ్‌,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
లీడ్‌ యాక్టర్స్‌ నటన
సినిమాటోగ్రఫి
డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌
పాటలు

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement