
గొప్ప నటులను కోల్పోయాం....
వేటపాలెం : తెలుగు సినీపరిశ్రమ వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ్ కిరణ్ వంటి గొప్ప నటులను కోల్పోయిందని నటుడు నవదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేటపాలం మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ హైస్కూల్లో ఆదివారం ఓ సావనీర్ను ఆవిష్కరించాడు. అనంతరం వేటపాలెంలో సన్నిహితుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ కేవలం అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు మంచి నటులను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోవడం బాధగా ఉందన్నాడు.
తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తయిందని, ఇప్పటివరకూ 25 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను నటించిన బంగారు కోట, అంతసీన్ లేదు, నటుడు చిత్రాలు రిలీజ్కి సిద్ధంగా ఉండగా, అంతా నీమాయ, పాగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నాడు. తనకు చందమామ, గౌతం, ఆర్య-2 చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపాడు. తాను చిన్నతనంలో చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినట్లు నవదీప్ గుర్తు చేసుకున్నాడు.