సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ కు రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు కూడా పునాదిరాళ్లు మొదటి సినిమా. తొలి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కాయి. 1977లో ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లెతో కలిపి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు.
(చదవండి : ‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం)
చిరంజీవితో రాజ్‌కుమార్
కాగా కొన్ని రోజుల నుండి గుడిపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్‌నర్ సురేష్‌రెడ్డి రూ.41వేలు, ‘మనం సైతం’ తరపున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ రూ.25 వేలు, దర్శకుడు పూరీ జగన్నాథ్ రూ.50 వేలు, మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ.10 వేలు, సినీయర్ డైరెక్టర్ కాశీవిశ్వనాథ్‌రూ.5 వేలు చొప్పున గుడిపాటి రాజ్ కుమార్‌కు ఆర్థిక సహాయం అందించారు.
ఇటీవల గుడిపాటి రాజ్ కుమార్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ బాధ తట్టుకోలేక ఆ తర్వాత భార్య చనిపోవడం రాజ్ కుమార్‌ను ఒంటరివాడిని చేసింది. ఒంటిరి బతుక్కు తోడు సంపాదన లేక అద్దె ఇంట్లో బాధలు పడుతూ వెళ్లదీస్తున్న దర్శకుడు ఈరోజు ఉదయం మృతిచెందారు.
(చదవండి : రాజ్‌కుమార్‌కు సినీ ప్రముఖుల చేయూత)
కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్ విజయవాడలో డిగ్రీ పూర్తి చేసి 1966లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది రెండేళ్ల పాటు నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సినిమాలపై ఇష్టం పెరిగింది. మంచి ఇతివృత్తాలతో సినిమా తీస్తే బాగుంటుందని భావించారు. కాలేజీ చదివే రోజుల్లోనే నాటకాలు వేస్తూ పాటలు కూడా పాడేవారు. ఆ అనుభవాన్ని సినిమాల్లో రంగరించాలనుకున్నారు. పాతబస్తీ జహనుమాలోనా సదరన్ మూవీస్ స్టూడియోలోకి అడుగుపెట్టారు. తన ఆశయాన్ని నిర్వాహకులతో చెప్పారు. సతీ అనసూయ, రహస్యం సినిమాలకు కో–డైరెక్టర్‌గా పని చేశారు. ఆ స్టూడియోలో మరాఠీ, హిందీ సినిమాల షూటింగ్‌లు జరుగుతుండేవి. రాజ్‌కుమార్ ఆసక్తిని గమనించిన ఆ సినిమాల దర్శకులు కో–డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌కు సినిమాలపై నమ్మకం పెరిగింది. తన అనుభవంతో ‘పునాదిరాళ్లు’ అనే సినిమాకు కథ రాసుకున్నారు. 1977లో ఈ సినిమా కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు.
(చదవండి : టాలీవుడ్‌లో మరో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment