
ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పుట్టింట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాంద్రాలోని లా మెర్ భవనంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం చోటుచేసుకున్న ఈ భవనంలోని 12వ ఫ్లోర్‌లో ఐశ్వర్యరాయ్ తల్లి బ్రిందా రాయ్, 10వ ఫ్లోర్‌లో సచిన్ టెండ్కూలర్ అత్తామామలు నివాసముంటున్నారు. మంటలు వ్యాపించడంతో ఐశ్వర్యరాయ్ తల్లి, సచిన్ కుటుంబీకులు హుటాహుటిన అపార్ట్‌మెంట్ బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న వెంటనే ఐశ్వర్యరాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ హుటాహుటిన ఆ భవంతి వద్దకు వచ్చారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని బాంద్రా పోలీసు స్టేషన్ అసిస్టెంట్ పోలీసు ఇన్పెస్టర్ సవిత షిండె తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో 13వ ఫ్లోర్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ పెళ్లి కాకముందు ఈ భవంతిలోనే నివాసం ఉండేవారు. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న అనంతరం, ప్రస్తుతం ఆమె కుటుంబం జూహులో నివాసముంటోంది.