
ఆ హిమక్రీము అంటే చాలా ఇష్టం!
యమలోకం నుంచి యమధర్మ రాజు భూలోకానికి రావడం ఏంటి? పోనీ వచ్చారే అనుకుందాం.. ఐస్‌క్రీమ్ లాగించడం ఏంటి? లాగించారే అనుకుందాం.. దానికి ‘హిమక్రీము’ అని కొత్త పేరు పెట్టడం ఏంటి? చిన్నపిల్లాడిలా ఆ హిమక్రీముని ఫన్నీగా చప్పరించడం ఏంటి? రియల్ లైఫ్‌లో సాధ్యం అనిపించని ఇలాంటి సంఘటనలను రీల్‌పై చూసినప్పుడు భలే సరదాగా ఉంటుంది. ఇదంతా చదువుతుంటే, ‘యమలీల’ సినిమాలో కైకాల సత్యనారాయణ గుర్తొస్తున్నారు కదూ.
ఐస్‌క్రీమ్‌ని ఆ తర్వాత సరదాగా హిమక్రీము అంటుంటాం. సరే.. ఆరడుగుల కైకాల ఆ సినిమాలో ఐస్‌క్రీములను ఇష్టపడ్డారు. మరి.. ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కి హిమక్రీములు ఇష్టమేనా? ఇష్టమేనట. కానీ, కండలు తిరిగిన దేహం కోసం ఇష్టమైన వాటిని త్యాగం చేయాలి కదా. అందుకే మన యంగ్ రెబల్ స్టార్ ఐస్‌క్రీమ్స్‌కి దూరంగా ఉంటారు. కానీ, ఒకే ఒక్క రోజు మాత్రం నో డైటింగ్. ఆ రోజు పెద్ద పెద్ద కప్పులు ఐస్‌క్రీమ్ లాగించేస్తారట. ‘‘ఏడాదిలో దాదాపు అన్ని రోజులూ నేను డైటింగ్ చేస్తా. ఎప్పుడైనా ఒకరోజు హాలిడే ఇస్తా.
ఆ రోజు మాత్రం ఐస్‌క్రీమ్ తింటా’’ అని ప్రభాస్ అన్నారు. ఇంతకీ ప్రభాస్ ఫేవరెట్ ఐస్‌క్రీమ్ ఏంటో తెలుసా? ‘ఫ్రూట్ ఎగ్జాటికా’ అట. అదెలా ఉంటుందో అంటున్నారా? గూగుల్ సహాయం తీసుకోండి మరి. ఆ సంగతలా ఉంచితే.. కప్పుల మీద కప్పులు ఐస్‌క్రీమ్ లాగించేస్తే, కేలరీలు పెరిగిపోతాయ్ కదా.. ‘‘అందుకే మర్నాడు ఎక్స్‌ర్‌జైస్ డోస్ పెంచుతా’’ అంటున్నారు ప్రభాస్.