తెలుగు సినిమా శతమానం భవతి
64వ జాతీయ సినీ అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా
64వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఇందులో మూడు తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. దాదాపు కొత్తవాళ్లతో తీసిన ‘పెళ్లి చూపులు’ తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంభాషణల అవార్డును గెలుచుకోగా ప్రేమానురాగాలు, ఆప్యాయతల కలబోతగా తెరకెక్కిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగాఅవార్డుకు ఎంపికైంది.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ను ఉత్తమ కొరియోగ్రఫీ (రాజు సుందరం) అవార్డుతోపాటు ప్రత్యేక జూరీ అవార్డు (మోహన్ లాల్) వరించాయి. ‘రుస్తుం’లో నటనకుగాను అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికవగా మలయాళ సినిమా ‘మిన్నా మినుంగ్’లో నటనకు సురభీ లక్ష్మి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
కోట్లు పెట్టి సినిమా తీస్తే అవార్డు వస్తుందా? బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడితే అవార్డులు వస్తాయా?... చిన్నవాళ్లు యాక్ట్ చేస్తే అవార్డులు రావా? తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు అవార్డులు దక్కవా? వంటి ప్రశ్నలకు 64వ జాతీయ అవార్డులు సమాధానం ఇచ్చాయి. భారీ, మీడియమ్, లో బడ్జెట్... ఇలా మూడు రకాల సినిమాలకూ పట్టాభిషేకం జరిగింది.
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘శతమానం భవతి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘పెళ్లి చూపులు’, ‘జనతా గ్యారేజ్’కి గాను మోహన్‌లాల్‌కు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమ ఆనందించదగ్గ విషయం. విలువలున్న సినిమాలకు జ్యూరీ సభ్యులు ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఒక్క ఉత్తమ నటుడి ఎంపిక విషయంలో మాత్రం విమర్శలు వినిపించినా.. మొత్తం మీద అవార్డుల ఎంపిక పారదర్శకంగానే జరిగినట్లు అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.