మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది : కె. రాఘవేంద్రరావు
‘‘ఈ సినిమా ఫుల్ రన్‌తో ముందుకెళుతోంది. ఇలాగే ముందుకు సాగుతూ ఫుల్ కలక్షన్స్ సాధించాలి. మనోజ్‌లో ఫుల్ కరెంట్ ఉంది. ఈ విజయానికి ప్రధాన కారణం అదే. విజయాన్ని అందుకున్న యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. ఈ చిత్రం విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడారు. అతిథుల్లో ఒకరైన కృష్ణంరాజు మాట్లాడుతూ- ‘‘మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న మంచి నిర్మాతలనిపించుకున్నారు. మనోజ్ కూడా సినిమా తీస్తే.. ‘ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ’ అవుతుంది.
‘కరెంట్ తీగ’ విజయం సాధించినందుకు చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. రచయిత పరుచూరి గోపాకృష్ణ మాట్లాడుతూ- ‘‘కరెంట్ తీగ శత్రువులకు షాక్.. లోకానికి వెలుగునిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు వెలుగు ఇచ్చింది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. కానీ, ఇందులో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ కోసం మనోజ్ తీసుకున్న రిస్క్ గురించి విని, బాధపడ్డాను. అప్పట్లో మేం కూడా డూప్ లేకుండా ఫైట్స్ చేశాం కానీ.. ఇలాంటి రిస్కులు తీసుకోలేదు. నా బిడ్డ అనే కాదు.. ఏ హీరో కూడా రిస్క్ తీసుకోకూడదు. ‘కరెంట్ తీగ’ మంచి కామెడీ చిత్రం అనో, పాటలు, ఫైట్స్ ఉన్నాయనో, సన్నీ లియోన్ ఉందనో కాదు.. ఈ చిత్రంలో ఉన్న నీతి కోసం చూడాలి.
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ముఖ్యంగా గత నాలుగేళ్లల్లో మేం నిర్మించిన చిత్రాల్లో ఆడియో పరంగా బాగా సేల్ అయిన చిత్రమిది. మనోజ్ పాడిన పాట నాకు బాగా నచ్చింది. మామూలుగా డైలాగులు చెప్పేవాళ్లు పాటలు అంతగా పాడలేరు. కానీ, మనోజ్ బాగా పాడాడు... బాగా ఫైట్స్ చేశాడు.. ఒక నటుడు ఇలా అన్నీ బాగా చేశాడంటే ఆ ఘనత దర్శకుడికి దక్కుతుంది. డెరైక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని నమ్మే వ్యక్తిని నేను. నాకు తెలిసి సినిమా పరిశ్రమలో రెండు కులాలే ఉన్నాయి.. ఒకటి.. నటకులం.. రెండోది సాంకేతిక నిపుణుల కులం. అంతే’’ అన్నారు. ‘‘ఏడాది పాటు రెండు వందల కుటుంబాలు కష్టపడి పని చేస్తే రెండు గంటల సినిమాని చూడగలుగుతున్నాం.
అలాంటి చిత్రాన్ని పైరసీతో నాశనం చేస్తున్నారు. దొంగ సీడీలు అమ్మడమే కాదు.. కొనడం కూడా నేరమే’’ అని మనోజ్ అన్నారు. ‘కరెంట్ తీగ’కు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారాయన. చిత్రం విజయం సాధించడం పట్ల నాగేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వేడుకలో జయసుధ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, తనీష్, నవీన్ చంద్ర తదితర అతిథులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు.