Geetha Govindam Review, in Telugu | ‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Wed, Aug 15 2018 12:19 PM | Last Updated on Wed, Aug 15 2018 12:44 PM

Geetha Govindam Telugu Movie Review - Sakshi

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ... మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన గీత గోవిందం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది...? గీత గోవిందుల ప్రేమ కథ ఏంటి..?

కథ ;
విజయ్‌ గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) లెక్చరర్‌. చిన్నప్పటి నుంచి చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన పద్ధతి గల కుర్రాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వెంటే 6 నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు. కొద్ది రోజులకు గీత (రష్మిక మందన్న)ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్‌) ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్‌. గీత కూడా అదే బస్సులో విజయ్‌ పక్కన సీటులోనే కూర్చుంటుంది. ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలనుకున్న విజయ్‌, ఫ్రెండ్స్‌ చెప్పిన చెత్త సలహాల కారణంగా ఆమె దృష్టిలో ఓ రోగ్‌ అనిపించుకుంటాడు. అలా గీతకు దూరమైన విజయ్‌ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? ఈ మధ్యలో గీత, గోవింద్‌ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నదే మిగతా కథ.
 

నటీనటులు :
సినిమాపై ఈ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అవ్వడానికి ముఖ్య కారణం విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాలో తన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన విజయ్, ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. భయస్తుడిలా హీరోయిన్‌ చుట్టూ మేడమ్‌..మేడమ్‌ అంటూ తిరిగే పాత్రలో విజయ్ నటన సూపర్బ్‌. తన డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్‌లోనూ ఫన్‌ జనరేట్ చేయటంలో విజయ్ దేవరకొండ్ సక్సెస్‌ అయ్యాడు. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించే సెంటిమెంట్‌ను పండించాడు. హీరోయిన్‌ గా రష్మిక మరోసారి వావ్‌ అనిపించారు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, గీత పాత్రలో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యారు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ చాలా బాగా చూపించారు. చాలా సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతో పోటి పడి నటించారు. చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. ఇతర పాత్రల్లో రాహుల్‌ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబు, అన్నపూర్ణ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ ;
ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్‌. మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్‌ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత కథే అయినా.. కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. కావాలని కామెడీ సీన్స్‌ను ఇరికించకుండా లీడ్‌ క్యారెక్టర్స్‌తోనే మంచి కామెడీ పండించాడు. తొలి భాగం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. తరువాత వచ్చే ఎం‍టర్‌టైన్మెంట్‌తో అన్ని కవర్‌ అయిపోతాయి. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ గోపిసుందర్‌ సంగీతం. కథలో భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్‌ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఇలా అన్ని సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
విజయ్‌ దేవరకొండ, రష్మిక నటన
సంగీతం
డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
పాత కథ
అక్కడక్కడా నెమ్మదించిన కథనం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement