![వరలక్ష్మికి మంచి రోజులొచ్చాయా?](/styles/webp/s3/article_images/2017/09/3/41461187524_625x300.jpg.webp?itok=NjGB_I02)
వరలక్ష్మికి మంచి రోజులొచ్చాయా?
కుట్రపరంపరై ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య పోరుకు కారణమైన కథ ఇది. దీంతో చాలా ఏళ్లుగా మరుగున పడ్డ ఈ కథ ఇప్పుడు ఎనలేని ప్రచారాన్ని సంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రాసిన ఈ కథతో తాజాగా ప్రయుఖ దర్శకుడు భారతీరాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. చిత్రాన్ని ఆయన ఇటీవలే ప్రారంభించారు కూడా. అదే పేరుతో దర్శకుడు బాలా చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో విశాల్, ఆర్య, అరవింద్‌సామి, అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రకటించడంతో భారతీరాజా,బాలాల మధ్య వివాదం మొదలైంది.
అయితే ఆరోపణలు, ప్రతి ఆరోపణలనంతరం బాలా తాను కుట్రపరంపరై కథను చిత్రంగా చేయడం లేదు,అదే కాల ఘట్టంలో జరిగిన వేరే సంఘటనలను చిత్రంగా ఆవిష్కరించనున్నట్లు స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇకపోతే బాలా తన చిత్ర నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అలాగే తన చిత్రంలో అదనంగా నటి వరలక్ష్మికి పాత్రను సృష్టించారన్నది తాజా సమాచారం. వరలక్ష్మి ఇంతకు ముందు బాలా దర్శకతంలో తారైతప్పట్టై చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె నటన బాలాను విపరీతంగా ఆకట్టుకుంది.
ఫలితం తాజా చిత్రంలోనూ వరలక్ష్మికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. ప్రపంచ సినిమానే ప్రశంసించే పాత్ర అని కోలీవుడ్‌లో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. మరో విషయం ఏమిటంటే చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌కే పరిమితమైన విశాల్‌కు జంటగా ఈ బ్యూటీ నటించిన మదగజరాజా చిత్రానికి మోక్షం వచ్చింది. ఈ నెల 29న తెరపైకి రానుంది. మొత్తం మీద ఆలస్యంగా అయినా వరలక్ష్మికి మంచి రోజులు మొదలయ్యాయన్న మాట.