సల్మాన్‌పై రితేశ్ దేశ్‌ముఖ్ ప్రశంసలు
ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు రితేశ్ దేశ్‌ముఖ్. నిర్మాతగా తాను తెరకెక్కిస్తున్న రెండో మరాఠీ చిత్రంలో సల్మాన్ నటిస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రితేశ్ మాట్లాడుతూ... మరాఠీ భాషపై సల్మాన్‌కు మంచి పట్టుందని, బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న సల్లూభాయ్ మరాఠీ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోవడం సామాన్యమైన విషయం కాదన్నాడు. మరాఠీ అంటే సల్మాన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆ అభిమానంతోనే తన చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడని, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిత్రంలో నటించేందుకు సల్మాన్ తనంత తానుగా ముందుకొచ్చాడని చెప్పాడు.
సల్మాన్ తల్లి మహారాష్ట్రకు చెందిన మహిళే కావడంతో సహజంగా సల్మాన్‌కు కూడా మరాఠీపై మంచి పట్టు లభించిందని, ఆయన మరాఠీ మాట్లాడడాన్ని చూస్తూ తానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. బాలీవుడ్‌లో దాదాపు పెద్ద హీరోలందరి సరసన నటించానని, అయితే సల్మాన్‌ఖాన్‌తో నటించే అవకాశం ఈ చిత్రంద్వారా తొలిసారిగా దక్కిందని, అదీ తన చిత్రంతోనే రావడం సంతోషంగా ఉందన్నాడు.
నిర్మాతగా మారిన తర్వాత మరాఠీలో నిర్మిస్తున్న రెండో చిత్రం ఇదని, సినిమాకు ‘లాయి భారీ’ పేరును ఖరారు చేశామని, జాతీయ అవార్డు గెలుచుకున్న నిశికాంత్ కామత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పాడు. ఇందులో సల్మాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని, ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనందున తానూ, సల్మాన్ కలిసి చిత్రీకరణలో పాల్గొన్నామని, ఇద్దరి మధ్య సాగే ఓ హాస్య సన్నివేశాన్ని చిత్రీకరించారని చెప్పాడు. సినిమాను ఈ సంవత్సరాంతంలో లేదంటే వచ్చే సంవత్సరం తొలి మాసంలో విడుదల చేసే అవకాశముందన్నాడు.