సాక్షి, ముంబై : నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ భార్యాభర్తలుగా నటించిన లిబాస్ బాలీవుడ్ సినిమాను 34 ఏళ్ల తర్వాత థియేటర్లలో తొలిసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు గుల్జార్‌కు, సినిమా నిర్మాత వికాస్ మోహన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ సినిమా ఇన్నేళ్లు విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా ముగింపు తనకు నచ్చలేదని, దాన్ని మార్చాల్సిందిగా వికాస్ మోహన్ గుల్జార్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. అయితే తాను సినిమాను విడుదల చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసిన వికాస్ మోహన్ సినిమాను మూలన పడేశారు.
వికాస్ మోహన్ 2016 సంవత్సరంలో మరణించారు. ఆయన స్థానంలో సినిమా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆయన కుమారుడు అముల్ మోహన్ ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. జీ క్లాసిక్ సినిమాలతోపాటు లిబాస్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తానని చెప్పారు. ఈ సినిమా పూర్తయిన నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఆర్‌డీ బర్మన్ పాటలకు ప్రశంసలు లభించాయి.
గుల్జార్ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కార్లా రాసిన ‘సీమ’ అనే చిన్న కథ ఆధారంగా లిబాస్ సినిమాలో సీమగా షబానా ఆజ్మీ నటించగా, ఆమె భర్తగా నసీరుద్దీన్ షా నటించారు. సీమ పాత్రధారి షబానా తన బాల్య మిత్రుడు టీకే పాత్రధారి రాజ్ బబ్బర్‌తో వెళ్లిపోవడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మనసును కట్టిపడేసే కథాకథనంలో ముగ్గురి పాత్రలు మనసుకు హత్తుకుంటాయనడంలో సందేహం లేదు.
34 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా
Published Sat, Aug 19 2017 2:59 PM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM
Advertisement