కెమిస్ట్రీ అనడం నాకు నచ్చదు | Gunturodu audio launch | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ అనడం నాకు నచ్చదు

Published Mon, Jan 30 2017 1:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కెమిస్ట్రీ అనడం నాకు నచ్చదు - Sakshi

కెమిస్ట్రీ అనడం నాకు నచ్చదు

– మోహన్‌బాబు
‘‘చిత్ర పరిశ్రమలో కొందరు ఏవేవో చెబుతారు. నా గురించి కూడా చెబు తుంటారు. కానీ, వాటిని పట్టించుకోకూడదు. కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్‌ సహజం. కానీ, ఫ్లాప్‌ సినిమా తీయాలనుకోం. కథ ప్రేక్షకులకు నచ్చకపోతే ఫ్లాప్‌ అవుతుంది’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, ప్రజ్ఞా జైశ్వాల్‌ జంటగా అట్లూరి బాలప్రసాద్‌ సమర్పణలో ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్‌ అట్లూరి నిర్మించిన చిత్రం ‘గుంటూరోడు’. డీజే వసంత్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మోహన్‌బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘సంగీత దర్శకుడు సత్యం మా బ్యానర్‌లో మంచి హిట్లిచ్చారు. ఆయన మనవడు వసంత్‌ ‘గుంటూరోడు’కు అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. భారతదేశం గర్వించదగ్గ గాయకుడు జేసుదాసుగారికి పద్మ విభూషణ్‌ అవార్డు రావడమంటే మనందరికీ వచ్చినట్టే. రికమండేషన్లతో చాలామందికి అవార్డులు వస్తాయి.

కానీ, స్వతహాగా ఆయనకు వచ్చినందుకు గర్వపడాలి. ఆయనకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా రావాలి. నా బిడ్డ మనోజ్‌ చాలా కష్టపడతాడు. ఈ చిత్రం హిట్‌ అవ్వాలి. మా రోజుల్లో హీరో, హీరోయిన్‌ జంట బాగుంది, చక్కగా నటించారు అనేవారు. ఇప్పుడు హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. ‘కెమిస్ట్రీ’ అనడం నాకు నచ్చదు’’ అన్నారు. హీరో విష్ణు మాట్లాడుతూ– ‘‘మ్యూజిక్‌లో మా నాన్నగారికి మంచి టేస్ట్‌ ఉంది. ఆ టేస్ట్‌ మనోజ్‌కి వచ్చింది. సంగీతంలో నేను పూర్‌. నటనాపరంగా నాన్నగారి ప్రతిభ నాకు వస్తుందేమో అనుకుంటున్నా’’ అన్నారు. మంచు మనోజ్‌ మాట్లాడుతూ– ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు నన్ను అడుగుతుంటారు... ఎందుకు కమర్షియల్‌ సినిమాలు చేయరు? అని. నేనేదో పెద్ద హీరో అయిపోవాలనుకోవడం లేదు. ఎన్టీఆర్, ఏయన్నాఆర్, కృష్ణ, నాన్న, బాలకృష్ణవంటి వారు వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు.

నేనూ వారిలా మంచి నటుడు అనిపించుకుంటే చాలు. సిక్స్‌ప్యాక్‌తో ఉండేవాడేంట్రా బియ్యం బస్తాలా అయిపోయాడంటున్నారు చాలామంది. ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం కోసం అలా తయరయ్యా. వైవిధ్యమైన చిత్రాలు తీసేందుకు అభిమానులు ఎంకరేజ్‌ చేయండి.. మూస ధోరణిలో వెళ్లేలా చేయకండి. నేను, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి ‘బిల్లా–రంగా’ చిత్రం సీక్వెల్‌ చేయాలనుకుంటున్నాం. మంచి డైరెక్టర్‌ దొరికితే తప్పకుండా చేస్తాం’’ అని తెలిపారు. ‘‘వసంత్‌ నాకు మంచి ఫ్రెండ్‌. తనలో టాలెంట్‌ ఉండీ, మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. అది ‘గుంటూరోడు’తో వస్తుంది’’ అని డైరెక్టర్‌ సత్య చెప్పారు. ‘‘ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అని శ్రీవరుణ్‌ అట్లూరి తెలిపారు. నిర్మాత కిరణ్, డైరెక్టర్లు పరశురామ్, కొండా విజయ్‌కుమార్, హీరోలు శర్వానంద్, సాయిధరమ్‌ తేజ్, నటులు రాజారవీంద్ర, కాశీ విశ్వనాథ్, ప్రవీణ్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, యూవీ క్రియేషన్స్‌ అధినేత విక్రమ్, కెమెరామేన్‌ సిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement