
4జీ అంటున్న జీవీ
4జీకి రెడీ అవుతున్నారు జీవీ.సంగీత దర్శకుడు, కథానాయకుడు ఇలా రెండు పడవలపై జోరుగా ప్రయాణం చేస్తున్న యువ తరంగం జీవీ.ప్రకాశ్‌కుమార్. ఈయన హీరోగా చేసిన చిత్రాల కంటే చేస్తున్న చిత్రాల సంఖ్యే అధికంగా ఉంది. డార్లింగ్ అంటూ తమిళ ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న జీవీ, ఆ తరువాత పెన్సిల్, ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు చిత్రాలతో మరింత దగ్గరయ్యారు.
ప్రస్తుతం కడవుళ్ ఇరుక్కాన్ కుమారు అంటూ ప్రేక్షకులను నమ్మించడానికి, బ్రూస్‌లీ అంటూ మరో హిట్ కోసం ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్నాయి. ప్రముఖ చాయాగ్రాహకుడు రాజీవ్‌మీనన్ దర్శకత్వంలో అడంగాదే, శశి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా మరో చిత్రానికి జీవీ పచ్చజెండా ఊపారు.
సీవీ.కుమార్ తను తిరుకుమరన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించనున్నారు. శంకర్ శిష్యుడు వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి 4జీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సతీష్, సురేశ్‌మీనన్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. హీరోయిన్ ఎంపిక జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.