ప్రస్తుతానికి అమ్మతోడు చాలు
నేనిప్పుడు పరిణితి చెందానంటున్నారు నటి హన్సిక. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఇప్పుడు నంబర్‌వన్ హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎవరి చిత్రం హిట్ అయితే వారే నంబర్‌వన్. అలా చూస్తే ఇక్కడ వారానికో హీరోయిన్ నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే నయనతార, అనుష్క, సమంత, శుృతిహాసన్, త్రిష, కాజల్ అగర్వాల్, హన్సిక ఇల ప్రముఖ హీరోయిన్లుగానే వెలుగొందుతున్నారు. వీళ్లలో ప్రస్తుతం అధిక చిత్రాలు చేతిలో ఉన్న నటి ఎవరంటే ఖచ్చితంగా నటి హన్సికనే అని చెప్పక తప్పదు. సక్సెస్ రేటును పెంచుకుంటూ పోతున్న హన్సిక నటిస్తున్న చిత్రాలు అరడజను ఉన్నాయి. ఇకపోతే ఇంతకుముందు పత్రికల వారితో ముచ్చడించాలంటే ముందుగా హన్సిక అమ్మ మాట్లాడేవారు. అలాంటిది ఇప్పుడే హన్సికనే హాయ్ ఎలా ఉన్నారు? అంటూ ముసిముసి నవ్వులతో గలగలా మాట్లాడేస్తున్నారు. ఆమెలో ఇంత మార్పు ఎలా కలిగింది? ఆ మాటా మంతి చూద్దాం!
ప్రశ్న: మీలో చాలా మార్పు వచ్చింది? చాలాపరిణితి చెందినట్లున్నారు? ఆ కథేంటో కాస్త వివరిస్తారా?
జవాబు: నేను చిత్ర రంగానికి బాలతారగా పరిచయం అయ్యాను. అప్పటి నా వయసు ఏడేళ్లు. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయ్యాను. అయితే అది పరిపక్వత చెందని వయస్సే. అప్పటి నుంచి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ వచ్చాను. అమ్మ తోడుగా ఉండి ఒక గురువుగా కూడా మార్గదర్శకురాలయ్యారు. ఇంకా నేను పరిణితి చెందకుంటే ఎలా? తొలి రోజుల్లో నేను అడిగింది ఇవ్వకుంటేనో చెప్పింది వినకుంటేనో కోపం వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కోపం రావడం లేదు. అలా నేనిప్పుడు చాలా పరిణితి చెందాను.
ప్రశ్న: తమిళం మాట్లాడటానికింకా శ్రమ పడుతున్నట్లున్నారే?
జవాబు: నా వెంట అమ్మ ఎప్పుడు ఉంటారు. ఆమెకు తమిళం తెలియదు. యూనిట్ బృందం ఏ విషయాన్నై అర్థవంతంగా చెప్పడానికి ఇంగ్లిషులోనే మాట్లాడుతారు. అలాంటిది నేనుగా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ తమిళం నేర్చుకుంటున్నాను. మరి కొంతకాలంలో తమిళ భాష పూర్తిగా నేర్చుకుంటాను.
ప్రశ్న : అందంగా ఉన్నారు. చాలా మంది అభిమానులను పొందారు. మీ లక్ష్యాన్ని చేరుకున్నారని భావిస్తున్నారా?
జవాబు: ఎక్కడో ఉత్తరభారతం నుంచి వచ్చిన నాకు ఇక్కడి అభిమానులు గుడి కట్టించే స్థాయికి ఆదరిస్తున్నారు. ఇంతకంటే సాధించాల్సింది ఏముంటుంది బలమైన పాత్రల్లో నటించలేదని అంటారా? అలాంటి అవకాశాలు రానీ యండి. నటించి చూపిస్తాను. ఇటీవల అరణ్మణై చిత్రం దెయ్యంగా అలాంటి బలమైన పాత్రనే చేశాను. అయినా దర్శ క నిర్మాతలు నన్ను కమర్షియల్ హీరోయిన్‌గానే చూస్తున్నారు.
ప్రశ్న: మళ్లీ బాలీవుడ్‌లో మకాం వేసే ఆలోచన ఉందా?
జవాబు: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. దక్షిణాదిలోనే నాకు రెడ్ కార్పెట్ ఆహ్వానం లభిస్తోంది. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.అంతే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు నేను నచ్చాను. ఇక్కడ నేనింకా చాలా సాధించాల్సింది ఉంది. తరువాత హిందీ చిత్రాల్లో నటించడం గురించి ఆలోచిస్తాను.
ప్రశ్న: మల్టీస్టారర్ చిత్రాలకే ప్రాముఖ్యత నిస్తున్నట్లున్నారు?
జవాబు: మీకో విషయం చెప్పనా. నేను కథలు వినేటప్పుడు ఆ చిత్రాల్లో హీరో ఎవరని అడగను. కథ బాగుందా? నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? అన్న విషయాల గురించే చూస్తాను. మాన్ కరాటే చిత్రంలో హీరో శివకార్తికేయన్ అన్న విషయం ఆ చిత్రాన్ని అంగీకరించిన తరువాతే తెలిసింది.
ప్రశ్న: దత్తత పిల్లలు ఎలా ఉన్నారు?
జవాబు: వారి సంఖ్య 30కి పెరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లలకు హోమ్ నిర్మించడానికి స్థలం కొనుగోలు చేశాను. త్వరలో నిర్మాణ పనులు మొదలెట్టనున్నాం.
ప్రశ్న:అమ్మ సహకారం మాత్రం చాలానుకుంటున్నారా?
జవాబు: మీరు దేని గురించి అడుగుతున్నారో అర్థమైంది. ప్రస్తుతానికి అమ్మ తోడు చాలు. మరో తో డు కోసం మరికొన్ని ఏళ్లు తరువాత ఆలోచిస్తాను.