బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! | Harshika Poonacha lashes out at Sandalwood | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 1:10 AM | Last Updated on Thu, Oct 25 2018 7:57 AM

Harshika Poonacha lashes out at Sandalwood - Sakshi

హర్షికా పూనాచా, డైరెక్టర్‌ ఎరే గౌడ, శ్రుతీ హరిహరన్‌

‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్‌ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం.

బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
వికాస్‌ బాల్, సాజిద్‌ ఖాన్, సుభాష్‌ కపూర్‌... ఇలా కొంతమంది బాలీవుడ్‌ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్‌లో కన్నడ స్క్రీన్‌ప్లే రైటర్, డైరెక్టర్‌ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్‌ స్టార్ట్‌ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు.

ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు సైతం నామినేట్‌ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు  ఈ సినిమాను ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కమిట్‌మెంట్స్‌ నుంచి విత్‌ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ  జూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులు పేర్కొన్నారట.

నా పోరాటం ఆగదు
‘‘అర్జున్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్‌ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్‌ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్‌ ఫ్యాన్స్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్‌ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్‌ చాంబర్‌ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

నాకది పెద్ద షాక్‌ – అమలాపాల్‌
ఇటీవల ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ మేకర్‌ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్‌ తనను వేధించారని ఆరోపించారు.  ఇప్పుడు నటి అమలాపాల్‌ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్‌లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్‌లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్‌. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్‌ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్‌ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు.

పురుషులకు ‘హీటూ’ ఉండాలి
ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్‌ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్‌ గాళ్‌ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్‌ సుమన్, హృతిక్‌రోషన్‌ ఎంతో టార్చర్‌ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్‌టూ’ మూమెంట్స్‌ ఉండాలి’’ అని రాఖీ సావంత్‌ అన్నారు.

ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం
హర్షిక పూనాచా ‘వీటూ’  (వియ్‌ టూ) మూమెంట్‌ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్‌ ఉమెన్‌గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్‌గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్‌ యాక్ట్రసెస్‌’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్‌ స్టార్టింగ్‌లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు.

ప్రతి ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్‌ సూపర్‌ స్టార్స్‌ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్‌ స్టార్‌ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్‌ పర్సనాలిటీస్‌ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్‌ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్‌.. ఓకేనా’ అని ఓ ఫేమస్‌ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్‌’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో నేను చాన్సులు మిస్‌ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను.

ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్‌ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్‌ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్‌గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్‌ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్‌ అండ్‌ బటర్‌’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. 


సుశీ గణేశన్‌, అమలాపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement