ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి...
తిరువనంతపురం: రసూల్ పోకుట్టి తర్వాత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకున్న మలయాళీగా సాజన్ స్కారియా గుర్తింపు పొందారు. ఆయన పనిచేసిన 'ఇన్‌సైడ్ ఔట్' చిత్రం బెస్ట్ యానిమేటడ్ ఫీచర్ ఫిలిమ్ గా ఎంపికైంది. అమెరికాలోని పిక్సర్ యానిమేషన్ స్టూడియోలో పనిచేస్తున్న ఆయన 'ఇన్‌సైడ్ ఔట్'కు క్యారెక్టర్ సూపర్ వైజర్ గా వ్యవహరించారు.
చిన్నప్పటి నుంచి కార్టూన్లు అంటే ఇష్టపడే స్కారియా అనుకోకుండా యానిమేషన్ రంగానికి వచ్చారు. కాలికట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సీమెన్స్ కంపెనీలో చేరారు. స్కారియా వేసిన డ్రాయింగ్స్ చూసిన జర్మనీ అధికారి అతడిని ప్రోత్సహించారు. 'నువ్వు గీసిన బొమ్మలు బాగున్నాయి. ఇంజనీర్ గా పనిచేస్తూ సమయం వృధా చేసుకోవద్దు' అని చెప్పడంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి యానిమేషన్ రంగానికి వెళ్లిపోయారు. అప్పటికి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.
ఇంజనీర్ గానే కొనసాగాలని స్కారియాను ఒత్తిడి చేయలేదని, బాస్ మాటలతో ఉత్తేజితుడై తన కలకు సాకారం చేసున్నాడని అతడి తండ్రి కె.స్కారియా తెలిపారు. తన కుమారుడు చిన్నతనంతో యాక్సిడెంటల్ గా బొమ్మలు వేయడం నేర్చుకున్నాడని వెల్లడించారు.
'ఆరో తరగతిలో ఉండగా సైకిల్ పైనుంచి పడిపోవడంతో సాజన్ కుడికాలు విరిగింది. దీంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వాడిని బోర్ కొట్టకుండా ఉండేందుకు డ్రాయింగ్ షీట్లు ఇచ్చేవాళ్లం. సాయంత్రం మేము ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి వాటి నిండా బొమ్మలు, కార్టూన్లు వేసేవాడు. మూడు నెలలు గడిచేలోగా బొమ్మలు గీయడంలో ఆరితేరిపోయాడ'ని కె.స్కారియా తెలిపారు. సాజన్ తన భార్య పిల్లలతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. రసూల్ పోకుట్టి 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.